Himachal CM Chair: సీఎం కుర్చీ కోసం కుస్తీ షురూ

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Meeting himachal cm post

Meeting Imresizer

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది. సీఎం పదవి కోసం నేతల మధ్య రగడ రాజకుంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే భయాలు హైకమాండ్‌ను వెంటాతుంటే.. మరోవైపు సిమ్లాలో సీఎం కుర్చీ కోసం లడాయి చెలరేగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నేతలు తన్నుకు చస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌, ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్‌ సుఖ్వీందర్ సింగ్ సుఖు, మొన్నటివరకూ అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి సీఎం సీటు కోసం పోటీపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ హిమాచల్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అంతా కలిసి పార్టీ విజయానికి పనిచేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య, ఎంపీ ప్రతిభా సింగ్‌ ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.

అధిష్టానం పరిశీలకుల ముందు బలప్రదర్శనకు దిగారు ఆమె మద్దతుదారులు. శాసనసభాపక్ష సమావేశానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో సిమ్లాలో రాజకీయం వెడెక్కింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవడం కోసం..సిమ్లాలో శాసనసభా పక్ష భేటీకి పిలుపునిచ్చింది హిమాచల్ కాంగ్రెస్. సమావేశంలో పాల్గొనేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్‌, సీనియర్ నేత దీపేందర్ హుడా, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్‌ రాజీవ్‌ శుక్లా వచ్చారు.

తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపాలని భావించారు. అయితే తాజా పరిస్థితి చూస్తుంటే ఏకాభిప్రాయంతో సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో బఘేల్‌, హుడా, రాజీవ్ శుక్లా గవర్నర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను హిమాచల్ ముఖ్యమంత్రిని చేసి.. పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి వీరభద్రసింగ్ కుటుంబం ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు 40 సీట్లు దక్కించుకుంది హస్తం పార్టీ. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 3 సీట్లు గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేక పోయింది.

  Last Updated: 09 Dec 2022, 11:17 PM IST