IFL Wealth Hurun Rich List 2022 : ఏపీ, తెలంగాణలో పెరిగిన‌ కుబేరులు

పేద‌, ధ‌నిక మ‌ధ్య అంత‌రం పెరుగుతోంది. మాన‌వాభివృద్ధి సూచిక‌లో అట్ట‌డుగు ర్యాంకుకు భార‌త్ చేరుకుంది.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 11:40 AM IST

పేద‌, ధ‌నిక మ‌ధ్య అంత‌రం పెరుగుతోంది. మాన‌వాభివృద్ధి సూచిక‌లో అట్ట‌డుగు ర్యాంకుకు భార‌త్ చేరుకుంది. కానీ, కుబేరుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతోంది. ప్ర‌త్యేకించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కుబేరుల సంఖ్య అనూహ్యంంగా ప‌రుగుపెడుతోంది. ఫార్మా రంగంలోని కుబేరులు సంప‌ద అనూహ్యంగా పైకి ఎగ‌బాకింది. ఏపీ, తెలంగాణలోని ధనవంతుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. రూ.56,200 కోట్లతో దివీస్ లేబొరేటరీకి చెందిన కుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.39,200 కోట్లతో హెటిరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారథిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 64 మంది, విశాఖపట్టణానికి చెందిన ఐదుగురు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి సంప‌ద అనూహ్యంగా పెరిగింద‌ని తాజాగా హురూన్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన జాబితాలో ఉంది.

‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్‌లిస్ట్ 2022’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 78 మంది కుబేరులు ఉన్నారు. వాళ్ల మొత్తం సంపదను రూ.3,90,500 కోట్లుగా లెక్కించింది. అలాగే, ఏపీ, తెలంగాణ నుంచి 11 మంది అమెరికా బిలియనీర్లు ఉన్నారు. ఈ జాబితాపై ఐఐఎఫ్ఎల్ వెల్త్ కో ఫౌండర్, జాయింట్ సీఈఓ యతిన్ షా మాట్లాడుతూ దేశ సంపద పెరిగేందుకు దోహదపడిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామ‌ని వివ‌రించారు.

కుబేరులా జాబితాలో ఉన్న 78 మందిలో ఆశ్చ‌ర్యంగా 75 మంది ఏపీ, తెలంగాణకు చెందిన వాళ్లు ఉండ‌డం గమనార్హం. సంపన్నుల్లో ఎక్కువమంది ఫార్మా ఆ తర్వాతి స్థానాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్, కన్‌స్ట్రక్షన్, కెమికల్ రంగాల చెందిన వాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణ నుంచి 1000 కోట్ల‌కు పైబ‌డిన సంప‌ద ఉన్న‌ కుబేరులు ఎక్కువ‌గా త‌యారయ్యే అవ‌కాశం ఉంద‌ని ఈ జాబితాను త‌యారు చేసిన యతిన్ షా పేర్కొన్నారు.

హురూన్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ తాము 11 ఏళ్లలో 26 సార్లు జాబితాను విడుదల చేసినట్టు వెల్ల‌డించారు. ఏపీ, తెలంగాణ రిచ్ లిస్ట్ లో చేరిన వారి సంఖ్య మూడుతో ప్రారంభమై 79కి పెరిగిందని గుర్తు చేశారు. వచ్చే దశాబ్దం నాటికి ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ నుంచి 200 మంది కుబేరులు త‌యారు అవుతార‌ని అంచ‌నా వేశారు. ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తదితరాలతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న వేళ భారత్ దానిని అధిగమించినట్టు ఈ జాబితా రుజువు చేస్తోంది. రూ. 100 లక్షల కోట్ల సంపదతో దేశంలోని 1,103 మంది ఈ జాబితాకు ఎక్కినట్టు జునైద్ వివరించారు.