The Sabarmati Report : నవంబరు 15న విడుదలైన ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఈ సినిమాలో నిజాలను చక్కగా చూపించారని ఆయన కొనియాడారు. నిజానిజాలు సామాన్య ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా సినిమా నిజాలను చూపిస్తున్నప్పుడు.. చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోడీ పేర్కొన్నారు. తప్పుడు అభిప్రాయాలు తక్కువ కాలం పాటే మనుగడలో ఉంటాయని.. వాటిని పట్టించుకోకుండా దీక్షతో ముందుకు సాగాలన్నారు.
ఎక్స్ యూజర్ పోస్టుకు స్పందిస్తూ..
‘‘2002 సంవత్సరంలో జరిగిన గోద్రా విషాదం వెనుక దాగిన సత్యాలను ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report) చక్కగా చూపించింది. సినిమా టీమ్ ఇందుకోసం అద్భుతంగా పనిచేసింది. ఆనాడు జరిగిన ఘటనల్లో 59 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు’’ అని పేర్కొంటూ ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు స్పందిస్తూ ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ, రాశీ ఖన్నా, రిద్ధీ డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను విడుదల చేసే క్రమంలో చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. అనుమతులు లభించడంలో జాప్యం జరిగింది. వీటన్నింటిని అధిగమించి ఈనెల 15న సినిమా విడుదలైంది. ఈ మూవీకి ధీరజ్ సర్నా డైరెక్టర్‌గా వ్యవహరించారు.
Also Read :BJP WhatsApp Head : బీజేపీ ముందడుగు.. వాట్సాప్ హెడ్ నియామకం.. ఎందుకంటే ?
గోద్రా రైలు ఉదంతం ఏమిటది ?
- 2002 సంవత్సరం ఫిబ్రవరి 27న ఉదయం సబర్మతీ ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషనుకు వచ్చి ఆగింది.
- సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్దసంఖ్యలో కరసేవకులు, హిందూ వలంటీర్లు ఉన్నారు. వారంతా అయోధ్యలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తమతమ గమ్యస్థానాలకు తిరిగి బయలుదేరారు.
- గోద్రా రైల్వే స్టేషను నుంచి రైలు బయలుదేరగానే.. చాలాసార్లు ఎవరో ఎమర్జెన్సీ చైన్‌ను లాగారు. దీంతో సిగ్నల్‌ను దాటగానే రైలును మళ్లీ ఆపాల్సి వచ్చింది.
- రైలును ఆపిన వెంటనే.. దాదాపు 2వేల మందితో కూడిన అల్లరి మూక వచ్చి రైలుపై రాళ్లు రువ్వారు. రైలులోని నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. ఎస్ 6 బోగీ దారుణంగా కాలిపోయింది.
- ఈ ఘటనలో 59 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 27 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారు. 48 మందికి గాయాలయ్యాయి.
- ఈ ఘటన తర్వాత.. 2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లు కొన్ని వారాల పాటు కొనసాగాయి. రెండు వర్గాల ఘర్షణలు చాలాచోట్ల దాదాపు మూడు నెలల పాటు కొనసాగాయి. అనంతరం దేశ రాజకీయ పరిణామాలు కూడా కొత్తరూపును సంతరించుకున్నాయి.