Karnataka : కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది కూరగాయలు అమ్ముకునే రైతులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి గురైన లారీ కూరగాయలు విక్రయించేందుకు సవనూరు నుంచి కుంట మార్కెట్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పిందని ఎస్పీ తెలిపారు.
బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ట్రక్కు డ్రైవర్ మరొక వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని తెలిపారు. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుబ్బలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు కర్నూరు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విషాదం చోటు చేసుకుంది. వేద పాఠశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్ణాటకలోని హంపీలో జరిగే ఆరాధన ఉత్సవాలకు వెళ్లి వస్తున్న విద్యార్థుల తుఫాన్ వాహనం టైర్ ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు ఏపీలోని కర్నూలుకు చెందిన వారు.