Site icon HashtagU Telugu

Goa Election Results 2022: గోవాలో కింగ్ మేకర్‌గా టీఎంసీ..?

Goa Election Results 2022

Goa Election Results 2022

ఇండియాలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్ర‌మంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇటీవ‌ల విడుద‌ల అయిన‌ ఎగ్జిట్ ఫ‌లితాల అంచ‌నాలు నిజ‌మ‌వుతున్నాయి. తాజా ఎన్నిక‌ల రిపోర్ట్స్ గ‌మ‌నిస్తే, ఉత్త‌రప్ర‌దేశ్‌లో అధికార బీజేపీ భారీ మెజారిటీతో విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోతుంది. దీంతో యూపీ మ‌రోసారి యోగీ స‌ర్కార్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం దాదాపు ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక పంజాబ్ ప్ర‌జలు ఈసారి జాతీయ పార్టీల‌కు షాక్ ఇచ్చారు. అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక మ‌ణిపూర్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయంగా క‌నిపిపిస్తుంది. ఇక గోవాలో ఎన్నిక‌ల ఫ‌లితాలే దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, బీజేపీ 19 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమి 4 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు.

గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌లో మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ జ‌రుగుతోంది. ఇరు పార్టీలు నువ్వా, నేనా అన్న‌ట్టు పోటీప‌డుతున్నాయి. గోవాలో మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. గోవాలో క్యాంప్ రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. గోవాలో గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఖంగుతిన్న కాంగ్రెస్ ఈసారి ముందు జాగ్ర‌త్ర చ‌ర్య‌లు చేప‌ట్టింది. గోవాలో గ‌త ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ట‌ఫ్‌ఫైట్ జ‌రిగింది. అయితే చివ‌రికి క్యాంప్ రాజకీయాలు మ‌లుపుతిప్ప‌డం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాషాయం కండువా క‌ప్పుకోవ‌డంతో గోవాలో బీజేపీ అధికారం చేప‌ట్టింది.

అయితే ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో పార్టీ స‌భ్యుల‌ను ముందుగానే క్యాపుల‌కు త‌ర‌లించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్ర‌స్తుత ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తుంటే, గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ కీల‌కం అయ్యే అవ‌కాశం ఉంద‌ని, టీఎంసీ కింగ్‌మేక‌ర్ అయ్యే చాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి గోవాలో హ‌స్తం గెలుస్తుందా లేక కాషాయం జెండా ఎగురుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా దేశంలో జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వెనుకంజ‌లో ఉంది. దీంతో ఈఎన్నిక‌ల‌తో కాంగ్రెస్ పార్టీ చాప‌చుట్టేయ‌డం బెట‌ర్ అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.