‘Dana’ Effect : వందల సంఖ్యలో విమానాలు , రైళ్లు రద్దు

Dana Cyclone : అక్టోబర్ 24న రాత్రి ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా మధ్య తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సంగా వీచాయి

Published By: HashtagU Telugu Desk
Dana Effect Train

Dana Effect Train

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ (‘Dana’ Effect) తుపాను కారణంగా దేశ వ్యాప్తంగా అనేక రైలు , విమాన సర్వీస్ లు రద్దయ్యాయి (Train and flight services have been cancelled).తూఫాన్ తీవ్రత పెరగడంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ మరియు ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గాలులు వీస్తున్నాయి. అక్టోబర్ 24న రాత్రి ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా మధ్య తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సంగా వీచాయి, ఈ ప్రభావం వల్ల ఒడిశాలో భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్, కేంద్రపరా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను ప్రభావం దృష్ట్యా ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, మొత్తం 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహాయక చర్యలను సమీక్షించడానికి తీర ప్రాంతాల్లో తాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. భువనేశ్వర్ మరియు కోల్‌కతా విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. అలాగే, దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రైల్వే శాఖ 400 రైలు సర్వీసులను రద్దు చేసింది.

ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ‘దానా’ తుపాను ప్రభావం ఉండకపోవడంతో అధికారులు, ప్రజలు కాస్త ఊరట చెందారు. శ్రీకాకుళం జిల్లాలో గురువారం రాత్రి 9 గంటల వరకు తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి, వర్షాలు అంతగా ప్రభావం చూపలేదు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉండనున్నందున, మత్స్యకారులు శనివారం (అక్టోబర్ 26) వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Organization) ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

Read Also : Ladakh : తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ మొదలు..

  Last Updated: 25 Oct 2024, 10:30 AM IST