Site icon HashtagU Telugu

Trai : స్పామ్ కాల్స్, మెసేజ్‌‌లు చేసే వాళ్ల కనెక్షన్లు పీకేయండి.. ట్రాయ్ ఆదేశాలు

TRAI Traceability Guidelines

TRAI Traceability Guidelines

Trai : మనదేశంలోని టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగ దారులకు మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను పంపే టెలీ మార్కెటర్లను కట్టడి చేయాలని వాటికి స్పష్టం చేసింది.  టెలికాం సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకున్న టెలీ మార్కెటింగ్ కంపెనీలను వైట్ లిస్టెడ్ సంస్థలు అంటారు. ఆ లిస్టులో లేని టెలీ మార్కెటర్లు కాల్స్ చేయకుండా..  మెసేజ్‌లు, వెబ్ లింకులు పంపకుండా నిరోధించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆర్డర్ ఇచ్చింది. నవంబరు 1 నుంచి వినియోగదారులకు చేరే అన్ని మెసేజ్‌ల వివరాలు పారదర్శకంగా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఆ మెసేజ్ లేదా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారాన్ని కస్టమర్‌కు ఇవ్వాలని తెలిపింది.  మోసపూరిత టెలీ మార్కెటర్ల ఆగడాలను ఇక ఉపేక్షించేది లేదని ట్రాయ్(Trai) తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join

స్పామ్‌ కాల్స్‌ చేసే టెలీ మార్కెటర్ల కనెక్షన్‌లను తొలగించాలని టెలికాం కంపెనీలకు సూచించింది. రెండేళ్ల పాటు ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని  నిర్దేశించింది. ఆయా సంస్థలను, వాటి ప్రమోషనల్‌ కంటెంట్‌‌‌ను టెలికాం కంపెనీలు అడ్డుకోకుంటే.. తామే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాల్సి వస్తుందని ట్రాయ్ హెచ్చరించింది. తమ ఆదేశాలను పాటించని టెలికాం కంపెనీల సేవలను నెల రోజుల పాటు ఆపేస్తామని తెలిపింది. ఈనేపథ్యంలో టెలికాం కంపెనీలు స్పామ్ కాల్ప్, మెసేజ్‌లు పంపే సంస్థలకు కళ్లెం వేసే దిశగా సంస్థాగత మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మనం పనికి రాని కాల్స్, మెసేజ్‌లను చూసి టైం వేస్టు చేసుకోవాల్సిన పని తప్పుతుంది.

Also Read :Reliance Power : అదానీ చేతుల్లోకి అంబానీ రిలయన్స్ పవర్ ?

సిమ్ స్వాప్‌ను అరికట్టేందుకు కొత్త నిబంధన

ఇటీవల కాలంలో సిమ్‌ స్వాప్‌, సిమ్ రీప్లేస్‌మెంట్ మోసాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కూడా ట్రాయ్ ఇప్పటికే నిబంధనలను తీసుకొచ్చింది.ఇప్పటి వరకు మన ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, ఎఫ్‌ఐఆర్ కాపీని అందిస్తే సరిపోయేది. ఆ వెంటనే  మనకు కొత్త సిమ్ కార్డ్ వచ్చేది.  కానీ ఇప్పుడు ప్రాసెస్ అంత ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సిమ్‌ను పొందేందుకు మనం కనీసం వారం రోజులు వెయిట్ చేయాలి. అన్ని తనిఖీలు పూర్తయ్యాకే టెలికాం కంపెనీ మనకు సిమ్‌ను మంజూరు చేస్తుంది. సిమ్ స్వాప్, సిమ్ రీప్లేస్‌మెంట్ మోసాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు.