Site icon HashtagU Telugu

Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

Bharat Bandh

Bharat Bandh

కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం. వీరి సమ్మె వల్ల బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, బొగ్గు, చమురు, ఉక్కు, ఆదాయపన్ను, కాపర్ పరిశ్రమల సేవలపై ప్రభావం పడుతుంది. ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు నోటీసులిచ్చారు.

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, విద్యుత్ కార్మికులు కూడా సమ్మెకు దిగడంతో.. ఈ రంగాల సేవలపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉంటుంది. రైల్వేలు, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా దీనికి మద్దతిచ్చాయి. ఈ ఉమ్మడి ఫోరంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల్లో సవరణలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధి హమీ నిధుల్లో కోతలు, వీరి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా దీనికి పూర్తి మద్దతును ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం తప్పదు. అందులోనూ ఇది ఆర్థిక సంవత్సరం చివరి వారం. ఈ సమయంలో సహజంగానే బ్యాంకులపై ఒత్తిడి ఉంటుంది. పైగా వివిధ రకాల లావాదేవీల లెక్కలు, చెక్కుల క్లియరెన్స్ లు అన్నీ మార్చి 31లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది.

విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని డిసైడ్ అవ్వడంతో కరెంటు సరఫరాకు అంతరాయం తప్పకపోవచ్చు. విద్యుత్ గ్రిడ్ 24 గంటలూ నడవాలంటే సరిపడా సిబ్బంది తప్పనిసరి. దీంతో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.