Supreme Court : శంభు బార్డర్‌లో గత కొన్ని నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పంజాబ్ – హర్యానా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ సారథ్యం వహిస్తారని వెల్లడించింది. ఈ కమిటీ సభ్యులు రైతులను కలిసి వారి డిమాండ్ల గురించి తెలుసుకుంటారని తెలిపింది. ఈ కమిటీ వారంలోగా తొలి సమావేశాన్ని నిర్వహించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రైతుల అంశాలపై రాజకీయాలు చేయొద్దని, వాటిని తాము ఏర్పాటు చేసిన కమిటీ విడతలవారీగా పరిశీలించాలని సూచించింది.
We’re now on WhatsApp. Click to Join
తమ శాంతియుత నిరసన కార్యక్రమాలను మరో ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చుకునే స్వేచ్ఛ రైతులకు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అంబాలా సమీపంలోని శంభు బార్డర్ వద్ద రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి నిరసన తెలుపుతున్నారు. నిరసన ప్రదేశం చుట్టూ హర్యానా ప్రభుత్వం బ్యారికేడ్లను ఏర్పాటు చేయించింది. అయితే ఈ బ్యారికేడ్లను తొలగించాలంటూ హర్యానా ప్రభుత్వానికి అక్కడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ హర్యానా సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పంటలకు కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన రైతులు ఢిల్లీ వైపుగా మార్చ్ చేసే అవకాశం ఉన్నందు వల్లే తాము బ్యారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపింది. దీన్ని ఇవాళ విచారించిన భారత సర్వోన్నత న్యాయస్థానం రైతుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఢిల్లీ బార్డర్‌లో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న రైతన్నలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రైతుల పోరాట పటిమను, న్యాయమైన డిమాండ్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం గుర్తించడం మంచి విషయమని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.