Omar Abdullah : జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ పంపించిన లేఖను ట్వీట్‌కు జత చేశారు.
Was pleased to receive the Principal Secretary to LG Manoj Sinha ji. He handed over a letter from the @OfficeOfLGJandK inviting me to form the next government in J&K. pic.twitter.com/D2OeFJwlKi
— Omar Abdullah (@OmarAbdullah) October 14, 2024
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలలో 42 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో ఎన్‌సీతో కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకుంది. శాసన సభా పక్ష నాయకుడిగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ మరియు కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరగా, 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరియు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
ఇది కాకుండా, జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం సోమవారం గెజిట్ విడుదల చేసింది, దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 2018లో బీజేపీ మరియు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది, తదుపరి శాసన సభను రద్దు చేసి ఆరు నెలల పాటు గవర్నర్ పాలన నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో, ప్రధాని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, భద్రతాపరమైన కారణాల వల్ల అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. అందుకుగానూ, 2019 అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం, 90 స్థానాల జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి 54 ఎమ్మెల్యేల మద్దతు ఉంది, బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.