Site icon HashtagU Telugu

Jharkhand : రేపే జార్ఖండ్ చివరి దశ పోలింగ్‌..12 జిల్లాల్లోని 38 స్థానాల్లో ఓటింగ్‌

Tomorrow is the last stage of Jharkhand polling.. Voting in 38 seats in 12 districts

Tomorrow is the last stage of Jharkhand polling.. Voting in 38 seats in 12 districts

Jharkhand Assembly Elections : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ ఎన్నికల ప్రచార సందడి ఆగిపోయింది. దీంతో రేపు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు 12 జిల్లాల్లోని 38 స్థానాల్లో బుధవారం ఓటింగ్‌ జరగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఈసీ 14,218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఏడు వేల బూత్‌లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మకమైన 31 బూత్‌లతో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి రవికుమార్ తెలిపారు. 239 పోలింగ్ స్టేషన్లను పూర్తిగా మహిళలు, 22 బూత్‌లను వికలాంగులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇక, రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 55 మంది మహిళా క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తంగా 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా అందులో 147 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, కల్పనా సోరెన్‌, బాబూలాల్‌ మరాండీ, సుదేశ్‌ మహతో, రవీంద్రనాథ్‌ మహతో, దీపికా పాండే సింగ్‌, హఫీజుల్‌ హసన్‌, సీతా సోరెన్‌, బసంత్‌ సోరెన్‌లతో సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బీజేపీ నుండి ఈసారి అత్యధికంగా 32 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జేఎంఎం నుంచి 20 మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏజేఎస్‌యూ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఆర్జేడీ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. 257 మంది అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

కాగా, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా ఈ నెల 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసీ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. రెండు దశల ఫలితాలు ఈ నెల 23నే విడుదల కానున్నాయి. తుది దశ పోలింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం వెలువడబోయే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: Krishank : సీఎం రేవంత్ అల్లుడి కంపెనీపై ఈడీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు