జులై 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలు (NHs)పై ద్విచక్ర వాహనాలపై (Two-Wheelers) కూడా టోల్ ఫీజు వసూలు చేసే అవకాశముందని జాతీయ మీడియా వర్గాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు టోల్ ఛార్జీలు కేవలం కార్లు, జీపులు, లారీలు, బస్సులు వంటి నాలుగు చక్రాల లేదా పెద్ద వాహనాలపై మాత్రమే ఉండగా, ఇప్పుడు బైకులకూ ఈ నియమాన్ని వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని రోడ్లు, రవాణా శాఖ భావిస్తుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇది అమల్లోకి వస్తే, ద్విచక్రవాహనదారులు కూడా ఫాస్టాగ్ (FASTag) ద్వారా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి, బైకులకు సైతం డిజిటల్ పద్ధతిలో వసూలు చేసే ఏర్పాట్లు చేపడతారు.
అయితే ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశముంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు, ఇతర జీవన వ్యయాలు భారం కావడమే కాక, ఇక టోల్ చార్జీలు కూడా విధిస్తే సామాన్య వాహనదారులకు మరింత భారంగా మారుతుందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.