Site icon HashtagU Telugu

Sakshi Mallik : ఇక్కడ బతికి ఉండాలంటే గుండెను బండరాయి చేసుకోవాలి..

To Survive Here, You Have To Turn Your Heart Into A Stone.. Sakshi Mallik

To Survive Here, You Have To Turn Your Heart Into A Stone.. Sakshi Mallik

By: డా. ప్రసాదమూర్తి

చాలా సందర్భాలలో అనిపిస్తుంది, మనం ఈ దేశంలో బతికి ఉండాలంటే మన హృదయాలను బండరాళ్లుగా మార్చుకోవాలి అని. ఎందుకంటే హృదయానికి చలనం ఉంటుంది. అది లోకంలో జరిగే అనేక సంఘటనలకు స్పందిస్తుంది. లోకంలో దుఃఖాన్ని, బాధను, కన్నీళ్లను చూసిన హృదయం తాను కూడా దుఃఖపడుతుంది. బాధపడుతుంది. కన్నీరు పెడుతుంది. కానీ మనం నిమిత్తమాత్రులం. మన చేతుల్లో ఏమీ లేదు అనుకుని మన హృదయాలను బండరాళ్లుగా మార్చుకుని ఒక మూలన ముడుచుకు కూర్చోవాలి. జరుగుతున్నదంతా నిర్వికారంగా నిరాలోచనగా చూస్తూ ఉండాలి. కేవలం చూస్తూ ఉండాలి. లేదూ, ఈ అన్యాయాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎవరైనా సాహసిస్తే ఏలికలను ప్రశ్నిస్తే వారు రాజా ద్రోహం కిందనో, లేదా ఉగ్రవాద చట్టం కిందనో, లేదా మారణాయుధ నియంత్రణ చట్టం కిందనో కటకటాల వెనుక కూర్చోవలసి వస్తుంది. అందుకే చాలామంది హృదయం ఉన్నవాళ్లు హృదయాలను శిలా సదృశ్యం చేసుకొని జరుగుతున్న నాటకాన్ని, విద్రోహాన్ని, విద్వేషాన్ని, విషాదాన్ని, దుర్మార్గాలను అక్రమాలను చూస్తూ కూర్చుంటారు అంతే.

We’re now on WhatsApp. Click to Join.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రెండు ఘటనలు నిన్నటి నుంచి నా హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. ఎదురు తిరగలేను. ఆయుధం పట్టలేను. మేరు పర్వతాలతో ఢీకొని గెలవలేను. అశక్తుడిని. అందుకే “ ఓ నా హృదయమా! నీకు ప్రాణం లేదు నువ్వు బండరాయి, అలాగే పడి ఉండు” అని సముదాయించుకుంటున్నాను. మణిపూర్లో దాదాపు 8 నెలల క్రితం మాయమైపోయిన 87 మంది మనుషుల శవాలు ఇంతకాలానికి వారి కుటుంబీకులకు అందజేశారట. ఎనిమిది నెలలు. ఆ మృతదేహాలలో ఒక నెల బాలుడు కూడా ఉన్నాడు. 8 నెలలపాటు ఆ వ్యక్తుల కుటుంబాల వారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, బంధుమిత్రులు అంతా ఎంత రోదించి ఉంటారో మనం ఊహించగలమా? ఒకవేళ ఊహించి ఏమీ పట్టనట్టు ఉండగలమా? కానీ తప్పదు ఉండాలి. అదే శాసనం. రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యం సాక్షిగా ఇక్కడ అమలవుతున్న రాజశాసనం. ఎందుకిలా, వారంతా కుకీ సముదాయం వారంట. మణిపూర్లో ఒక జాతిని మరొక జాతి ద్వేషిస్తూ ధ్వంసిస్తూ మృత్యుతాండవం చేస్తున్న సందర్భానికి ఆద్యంతాలు లేవు. అది కొనసాగుతూనే ఉంది.

ఇంత దారుణాన్ని ఇంత అమానుషాన్ని, ఒక మనిషిని మరొక మనిషి ఇలా నెత్తురులో ముంచి పైకి తేల్చి వికటాట్టహాసం చేయడాన్ని ఎవరు నిరోధిస్తారు? పాలకులే కదా! కానీ వారు అనేక రాజకీయ కారణాలతో వారి నోళ్ళకి, గుండెలకు తాళాలు వేసుకుని కూర్చున్నారు. కేవలం ఈ ఘటనలను వ్యతిరేకించే వారి మీద మాత్రమే విరుచుకుపడినప్పుడు ఆ తాళాలు తెరుచుకుంటాయి. ఇన్ని నెలల తర్వాత శవాల గుట్టలుగా తమ బంధుమిత్రుల ముందు తమ కుటుంబీకుల ముందు పడి ఉన్న ఆ కుకీ సముదాయపు వ్యక్తుల మృతదేహాలను చూడకూడదు అనుకుంటూనే, చూడకుండా వదిలిపెట్టని మీడియా అత్యుత్సాహంతో చూశాను. అప్పుడు నేనేం చేయగలను? “ ఓ నా హృదయమా నువ్వు ఒక రాతి గడ్డగా మారిపో” అని నన్ను నేనే శపించుకున్నాను. మరో ఘటన మరింత దారుణమైంది నిన్న చూశాను, విన్నాను, చదివాను. ఎంతోకాలంగా భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రజభూషణ్ సింగ్ తమ ఫెడరేషన్ లో ఉన్న మహిళా మల్లయోధుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని తన అధికార మదంతో వశపరచుకోవాలని చూస్తున్నాడట. ఈ ఆరోపణలతో మహిళా మల్లయోధులు ఎన్నో ఏళ్లుగా తట్టుకొని తట్టుకుని చివరికి తమకు న్యాయం చేయమని నడిరోడ్డు మీదకు వచ్చారు.

Also Read:  YSRCP : విజయవాడ పశ్చిమ నుంచి మళ్లీ పోటీ చేస్తాన‌న్న వెల్లంప‌ల్లి.. తెర‌మీద‌కు మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ పేరు

నెలల తరబడి వారి ఆందోళన సాగినా ప్రభువుల వారికి కించిత్తు దయ కలగలేదు. అలాంటి సందర్భం ఒక సినిమాలో చూసినా మనం చెల్లించకుండా కానీ స్పందించాల్సిన బాధ్యతలో ఉన్న పెద్దలు మాత్రం మౌనమే మా భాష అంటూ కూర్చున్నారు.చివరికి సర్వే సర్వత్రా నిరసన ఒక దావానలంలా ముట్టడిస్తున్న తరుణంలో ఆ మహిళా మల్లయోధుల్ని బుజ్జగించి న్యాయం చేస్తామని ఏమరచి వారి పోరాటాన్ని విరమింప చేశారు. మహిళా మల్లయోధుల డిమాండ్ ఒకటే. అయ్యా బ్రజభూషణ్ సింగ్ ని ఫెడరేషన్ నుంచి తొలగించండి, ఒక మహిళా రెజ్లర్ ఫెడరేషన్ కి నాయకత్వం వహిస్తే మహిళల పట్ల ఎలాంటి లైంగిక దాడులు జరగడానికి అవకాశం ఉండదని వారి కోరిక. అలాగే అన్నారు పాలకులు. కానీ భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు జరిగి బ్రజభూషణ్ స్థానంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, బిజినెస్ పార్ట్నర్ సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు. మరో మాజీ మహిళా రెజ్లర్ పోటీలో ఉంటే ఆమెకు 47 ఓట్లలో కేవలం 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. 40 ఓట్లతో సంజయ్ సింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవిని అత్యంత సునాయాసంగా హస్తగతం చేసుకున్నాడు.

చివరికి తమ పోరాటం ఇలా ముగిసిందని ఒక ప్రెస్ మీట్ పెట్టి మహిళా రెజ్లర్లు కన్నీరు మున్నీరయ్యారు. సాక్షీ మల్లిక్, దేశానికి ప్రతిష్ట సాధించిన మల్ల యోధురాలు తానిక కుస్తీలో ఉండనని, ఇక తాను రెజ్లింగ్ రంగానికి దూరంగా ఉంటానని బోరున విలపిస్తూ విలేకరుల సమక్షంలో భళ్ళున బద్దలైపోయింది. ఈ ఘటన చూసి, విని, చదివి నా హృదయం కూడా అశ్రుపూరిత దుఃఖ దగ్ధ క్రోధాగ్నిలో వణికిపోయింది. కానీ ఏం చెప్పమంటారు, నా నిస్సహాయతకు నేనే సిగ్గుపడుతూ నా హృదయాన్ని నేనే సముదాయించుకుంటూ తెల్లవార్లూ “ నువ్వు స్పందించకు ఓ నా హృదయమా స్పందించకు” అంటూ దాన్ని బుజ్జగిస్తూ గడిపేశాను. అందుకే అంటున్నాను, లోకంలో మాటేమో గానీ, ఈ దేశంలో బతికి ఉండాలంటే మన హృదయాలను బండరాళ్లుగా మార్చుకోవాలి.

Also Read:  KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు

Exit mobile version