Delhi New CM : బీజేపీ పార్టీ ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయిత ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో తొమ్మిది మందిని షార్ట్ లిస్ట్ చేసి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Also: CM Chandrababu : యాసిడ్ దాడి ఘటన..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సైతం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మోడీ ఢిల్లీకి వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. మోడీతో చర్చలు జరిపి ఓ అంచనాకు రానున్నట్లు తెలిసింది.
కాగా, అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ భారత్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా , పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం నూతన సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఇకపోతే..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయఢంకా మోగించి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేక చతికిలపడిన విషయం తెలిసిందే.
Read Also: Rahul Ravindran : నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం