Tihar jail : ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో చోటుకు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీనిని ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జైలులో ఉంచే ఖైదీల రద్దీ, జైలు చుట్టుపక్కల నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు భారతదేశంలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటిగా, ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో తీహార్ గ్రామం సమీపంలో 400 ఎకరాల్లో 1958లో ఏర్పాటు చేశారు.
Read Also: SVSN Varma : పిఠాపురంలో వర్మ కొత్త వ్యూహం..ఎవరికి నష్టం..?
ఇది మొత్తం 9 జైళ్లతో 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1966లో దీని నిర్వహణను పంజాబ్ ప్రభుత్వం నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. దేశ రాజధానిలో ప్రధాన జైలుగా ఇది ఉంది. తీహార్ జైలు దాని సామర్థ్యాన్ని మించి ఖైదీలతో నిండి ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర రద్దీ సమస్యను ఎదుర్కొంటోంది. దీని సామర్థ్యం 10,026 మంది ఖైదీలకు మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం దాదాపు 19,500 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీ తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మండోలీ జైలు సముదాయాన్ని నిర్మించింది. నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో కొత్త జైళ్లను నిర్మించే ప్రతిపాదనలు ఉండగా తాజాగా తీహార్ జైలునే వేరే చోటుకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: Delimitation : నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు