Tigers : కర్ణాటకలో దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం

వన్యప్రాణులపై హింసాత్మకంగా ప్రవర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు, పులులు ఓ ఆవు మృతదేహంలో విషం కలిపినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tiger Poisoning

Tiger Poisoning

Tigers : కర్ణాటక రాష్ట్రం మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వన్యప్రాణులపై హింసాత్మకంగా ప్రవర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు, పులులు ఓ ఆవు మృతదేహంలో విషం కలిపినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషప్రయోగానికి గురై ఓ పులి, దాని నాలుగు పిల్లలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది రాష్ట్రంలో ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం కింద నమోదైన మొట్టమొదటి సంఘటనగా గుర్తించారు.

విషం కలిపిన కళేబరంతోనే ఎర వేసిన దుండగులు

అటవీ శాఖ అధికారుల సమాచారం మేరకు, కొన్ని రోజుల క్రితం ఒక పులి సమీప గ్రామంలోని ఆవును చంపింది. పగ తీర్చుకునే ఉద్దేశంతో స్థానికులు ఆ ఆవు కళేబరంలో విషం కలిపి అడవిలో వదిలి ఉంటారని అనుమానిస్తున్నారు. దాన్ని తిన్న పులి మరియు దాని నాలుగు పిల్లలు తక్షణమే విష ప్రభావానికి లోనై చనిపోయినట్లుగా శవపరీక్షల్లో తేలినట్లు తెలిపారు.

మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆగ్రహం – విచారణకు ఆదేశాలు

ఈ సంఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అసహజ మృతిగా పరిగణించి మూడు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ బాధ్యతారాహిత్యం తేలితే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. ఇది వన్యప్రాణుల సంరక్షణపై తీవ్రమైన ప్రభావం చూపే ఘటనగా పేర్కొన్నారు.

కర్ణాటకలో పులుల సంరక్షణకు సవాల్

ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 563 పులులు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. ఇది మధ్యప్రదేశ్ తర్వాత అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నా, గ్రామస్తుల నుండి వచ్చే ముప్పు అటవీ జీవుల సంరక్షణకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. అధికారులు ప్రస్తుతం ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతుండగా, మృతి చెందిన పులుల వివరాలు, బాధ్యుల గుర్తింపుపై కసరత్తు కొనసాగుతోంది.

Maoists : ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు మావోయిస్టులు హతం

  Last Updated: 27 Jun 2025, 12:56 PM IST