Site icon HashtagU Telugu

Civil Judge Posts: లా ఫ్రెషర్లకు బ్యాడ్ న్యూస్.. సివిల్ జడ్జి పోస్టుల భర్తీపై ‘సుప్రీం’ కీలక తీర్పు

Civil Judge Posts Recruitment Supreme Court Three Years Law Practice

Civil Judge Posts: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే న్యాయవాదిగా కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పోస్టులో కొత్త లా గ్రాడ్యుయేట్లను నియమించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, ఏజీ మసీహ్, వినోద్ చంద్రన్‌‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అందుకే న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించే అభ్యర్థులకు కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి అని బెంచ్ వ్యాఖ్యానించింది. జడ్జిగా ఎంపికైన తర్వాత కోర్టులో బాధ్యతలు చేపట్టే ముందు, అభ్యర్థి తప్పనిసరిగా ఒక సంవత్సరంపాటు శిక్షణ పొందాలని కోర్టు(Civil Judge Posts) ఆదేశించింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన నియామక ప్రక్రియలపై ఈ కొత్త నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ తీర్పును భారత న్యాయవ్యవస్థలో అనుభవం, నైపుణ్యానికి ప్రాధాన్యతనిచ్చే చారిత్రాత్మక నిర్ణయంగా పరిగణిస్తున్నారు.

Also Read :KCR Interrogation: ‘కాళేశ్వరం’‌పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు

కోర్టులకు సుప్రీంకోర్టు కీలక సూచనలివీ..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులకు మూడేళ్ల  న్యాయవాద ప్రాక్టీస్ అనుభవం ఉండాలి. ఈ అనుభవాన్ని కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ అడ్వకేట్ ధ్రువీకరించాలని సుప్రీంకోర్టు ఇవాళ  నిర్దేశించింది. అభ్యర్థులు లా క్లర్క్‌గా చేసిన అనుభవాన్ని కూడా ఈ ప్రాక్టీస్ కాలంలో చేర్చుకోవచ్చని తెలిపింది. న్యాయశాఖ పరిధిలో జరిగే డిపార్ట్‌మెంటల్ పరీక్షల ద్వారా  పలువురికి ప్రమోషన్ ఇచ్చి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టులను కేటాయిస్తుంటారు. ఈవిధంగా ప్రమోషన్ పొందే వారి సంఖ్యను ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులు తమ తమ సేవా నిబంధనల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ విధానాన్ని కూడా అమలు చేయాలని సోమవారం రోజు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రెండు తీర్పులు న్యాయవ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, నాణ్యతతో ముందుకు నడిపించే దిశగా కీలక చర్యలుగా భావిస్తున్నారు.

Also Read :Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్‌ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?

సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో.. 

చాలా రాష్ట్రాల్లో కనీసం మూడేళ్ల ప్రాక్టీస్ కలిగిన న్యాయవాదులే న్యాయ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చనే షరతు ఉండేది. అయితే 2002లో సుప్రీం కోర్టు ఈ నిబంధనను తొలగించింది. దీంతో కొత్త లా గ్రాడ్యుయేట్లు మున్సిఫ్-మేజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలిగారు. అయితే, తర్వాతి కాలంలో న్యాయవాదులకు మాత్రమే ఈ పోస్టులను కేటాయించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అనేక హైకోర్టులు కూడా కనీస ప్రాక్టీస్ అవసరాన్ని పునరుద్ధరించాలనే చర్యకు మద్దతు తెలిపాయి. 2025 జనవరి 28న ఈ దరఖాస్తులపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అనంతరం కనీస సర్వీసు నిబంధన లేకుండా గుజరాత్ హైకోర్టు ప్రారంభించిన నియామక ప్రక్రియపై కోర్టు బ్యాన్ విధించింది.