Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్‌ను పంపిన వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 19 ఏళ్ల గణేశ్ రమేశ్ వనపర్తిని అరెస్టు చేశారు. తాజాగా గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల రాజ్‌వీర్ కాంత్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు.. shadabkhan @ mailfence.com అనే మెయిల్ నుంచి బెదిరింపు సందేశాలు పంపాడు. తాము అడిగినంత డబ్బును ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు. తమ వద్ద కత్తిలాంటి గన్‌మెన్లు ఉన్నారని, వాళ్లతో హత్య చేయిస్తామంటూ ముకేశ్ అంబానీ సెక్యూరిటీకి వరుసపెట్టి వార్నింగ్ ఈమెయిల్స్ పంపాడు. మెయిల్ ఐడీల ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రాక్ చేసిన ముంబై పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన నిందితుడు గణేశ్ రమేశ్ వనపర్తి నవంబర్ 1న ముకేశ్ అంబానీ సెక్యూరిటీకి మెయిల్ పంపాడు. రూ.500 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తామని తన ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. అతడిని అరెస్టు చేసిన వెంటనే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే నవంబర్ 8న వరకూ కోర్టు అతడికి రిమాండ్ విధించింది. వరంగల్‌లోని ఒక విద్యాసంస్థ నుంచి గణేశ్ రమేశ్ వనపర్తి వార్నింగ్ మెయిల్స్ పంపాడని పోలీసులు గుర్తించారు. మెయిల్స్‌ను పంపిన వెంటనే అతడు డిలీట్ చేశాడని ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. అయితే ట్రాష్ ఫోల్డర్ నుంచి పోలీసులు ఆ మెయిల్‌ని రికవర్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎందుకు ఇలా చేశారని పోలీసులు ఈ ఇద్దరు నిందితులను ప్రశ్నించగా.. ‘‘ఏదో సరదాకి’’ అని ఆన్సర్ ఇచ్చారట. సరదా కోసమే ఈ పని చేశామనే నిందితుల స్టేట్మెంట్ పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తికి గుజరాత్‌కు చెందిన మరో యువకుడితో ఎలా లింక్ ఏర్పడింది ? ఇద్దరూ ఒకే వారం వ్యవధిలో ఒకే విధమైన వార్నింగ్ మెయిల్స్‌ను ముకేశ్ అంబానీ సెక్యూరిటీకి ఎలా పంపారు ? వీరిద్దరూ ఎలా లింక్ అయి పనిచేశారు ? ఇంకేదైనా ముఠా.. వీరిద్దరితో ఈ వార్నింగ్ మెయిల్స్‌ను పంపించే ఏర్పాట్లు చేసిందా ? వార్నింగ్ ఇచ్చి వందల కోట్లు అడిగే సాహసానికి వీరు ఎలా పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి(Mukesh Ambani) ఉంది.