Ayodhya – 84 Seconds : జనవరి 22న మధ్యాహ్నం అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు శుభ ముహూర్తం 84 సెకన్ల పాటు ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ ఘడియలు ఉన్నాయని అంటున్నారు. ఈ ముహూర్తం వివరాలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని.. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ టైంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న టైంలో మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని చెప్పారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన టైంలో గురు స్థానం బలంగా ఉందన్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య(Ayodhya – 84 Seconds) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని మహారాష్ట్రలోని పుణెకు చెందిన కేశవ్ శంఖనాద బృందానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్ మహాజన్‌కు ఆహ్వాన పత్రిక పంపించారు. కేశవ్ శంఖనాద బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి శంఖనాదం చేయనున్నారు. కేశవ్ శంఖనాద బృందంలో 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది మహిళలే. ఐదేళ్ల నుంచి 85 ఏళ్ల వయసున్న వారు ఇందులో ఉన్నారు. కాగా, రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్యలో హోటల్ గదుల రేట్లు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల రేట్లు రూ.లక్షకు చేరాయి. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్ సాధ్యమవుతాయని అంటున్నారు. ఇక భద్రతా కారణాలతో అయోధ్యలో హోటల్ బుకింగ్స్‌ను అధికారులు రద్దు చేస్తున్నారు.