Site icon HashtagU Telugu

Golden Temple Blast: గోల్డెన్ టెంపుల్ సమీపంలో బ్లాస్ట్.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Golden Temple Blast

Resizeimagesize (1280 X 720) 11zon

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల (Golden Temple Blast) పరంపర ఆగలేదు. బుధవారం రాత్రి ఇక్కడ మరో తక్కువ తీవ్రతతో కూడిన పేలుడు వినిపించింది. ఈ మేరకు పోలీసులు గురువారం (మే 11) సమాచారం అందించారు. అమృత్‌సర్‌లో వారం రోజుల్లోపే ఇది మూడో పేలుడు. ఈ వారం పేలుళ్లకు సంబంధించి ఐదుగురిని అరెస్టు (5 Arrested) చేసినట్లు పంజాబ్ పోలీసు చీఫ్ తెలిపారు. గురు రాందాస్ నివాస్ భవనం వెనుక బుధవారం అర్ధరాత్రి తాజా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి పెద్ద శబ్దం వినిపించినట్లు పోలీసులకు సమాచారం అందిందని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ ఇంతకుముందు చెప్పారు. మరో పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నామని ఆయన విలేకరులతో అన్నారు. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేశామని, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని చెప్పారు.

పంజాబ్ పోలీసులు గురువారం అర్థరాత్రి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇక్కడి శ్రీ గురు రామ్ దాస్ నివాస్ సమీపంలో తక్కువ తీవ్రత కలిగిన పేలుడుకు సంబంధించి ఈ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు పంజాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) గౌరవ్‌ యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా సమాచారం అందించారు. చిన్న పేలుడు కేసును ఛేదించామని, దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.

Also Read: BJP and MIM: పాకిస్తాన్ తర్వాత పాతబస్తీనే టెర్రరిస్టులకు అడ్డా!

ఈ మేరకు ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం కూడా నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. బుధవారం అర్థరాత్రి గోల్డెన్ టెంపుల్ సమీపంలోని శ్రీ గురురామ్ దాస్ నివాస్ దగ్గర చప్పుడు వినిపించిందని ఆయన చెప్పారు. గత వారంలో ఇలాంటి పేలుడు సంభవించడం ఇది మూడోది. గతంలో మే 6, మే 8 తేదీల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి పేలుళ్లు జరిగాయి. ఇక్కడ బుధవారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

పంజాబ్ పోలీసులకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం.. ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే తక్కువ తీవ్రత కలిగిన ఈ పేలుడు ఉద్దేశం. ఈ పేలుడుకు బాణాసంచా ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేలుడులో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. పంజాబ్‌లో పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ఇక్కడ ఖలిస్తానీ కుట్రల కారణంగా పంజాబ్ పోలీసులు, కేంద్ర సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి.