Site icon HashtagU Telugu

Jewelery: నగల దుకాణంలో చోరీకొచ్చి సారీ అని వెళ్లిపోయిన దొంగలు

Thief Jewelery Robbed

Thiefh

నగల (Jewelery) దుకాణంలో చోరీకొచ్చిన దొంగలు తమ ప్రయత్నం విఫలం కావడంతో సారీ అని ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌‌‌లో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను చిన్నూ, మున్నూగా పోలీసులు గుర్తించారు. దీపక్ కుమార్‌కు చెందిన నగల దుకాణంలో వారు చోరీకి యత్నించారు. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే షాపు తెరిచిన దీపక్.. చోరీ ఆనవాళ్లను గుర్తించారు. ఘటనాస్థలంలో దొంగలు వదిలి వెళ్లిన చిట్టి లభించింది. అంతేకాకుండా.. గదిలోని కృష్ణుడి విగ్రహం కూడా గోడవైపు తిరిగి ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయారు.

నగలు (Jewelery) దోచుకునేందుకు దొంగలు విశ్వప్రయత్నమే చేసినట్టు బయటపడింది. షాపులోకి ప్రవేశించేందుకు ఏకంగా 15 అడుగుల పొడవున్న సొరంగాన్ని తవ్వారు. దుకాణం సమీపంలోని నాలా నుంచి ఈ సొరంగమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. షాపులోని నగల పెట్టెను తెరవడంలో మాత్రం వారు విఫలమయ్యారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌‌తో నగల పెట్టెను తెరిచేందుకు సాధ్యపడలేదు. దీంతో.. వారు సారీ అంటూ ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు. ఇక కృష్ణుడి విగ్రహం గోడవైపునకు తిరిగి ఉండటాన్ని బట్టి.. దొంగలు దేవుడి ముందు చోరీ చేసేందుకు భయపడి విగ్రహాన్ని గోడవైపు తిప్పి ఉంటారని షాపు యజమాని అభిప్రాయపడ్డారు. చోరీకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లూ దొరక్కుండా నిందితులు షాపులోని సీసీకెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, ఫుటేజీని తమతో తీసుకెళ్లిపోయారు. కాగా..షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీకెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టేందుకు పోలీసులు ప్రస్తుతం యత్నిస్తున్నారు.

Also Read:  Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..