RSS: దేశ కులగణనకు తాము వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్

  • Written By:
  • Updated On - December 22, 2023 / 01:44 PM IST

RSS: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  స్పష్టం చేసింది. RSS ప్రచార హెడ్ సునీల్ అంబేకర్ తాజాగా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. కులగణన ప్రక్రియను RSS వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే కులగణన చేపట్టిన తరువాత ఆ డేటాను సమాజ హితానికి వినియోగించాలని సూచించారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని RSS కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఈ కుల‌గ‌ణ‌న‌ను వినియోగించుకునే ప్రమాదం ఉందన్నారు.

ఎలాంటి వివక్ష, అసమానతలు లేని హిందూ సమాజంకోసం RSS నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.  సమాజాభివృద్ధి కాంక్షించేలా కులగణన చేపట్టాలని పేర్కొన్నారు. కాగా ఇటీవలనే కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కుల గణనను వ్యతిరేకించారు. కులాల వారీ జనాభా లెక్కలకు రిజర్వేషన్లకు సంబంధం లేదని తెలిపారు. రెండూ వేరువేరు అంశాలని అన్నారు. సామాజిక ఉన్నతి కోసమే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇంకా కొన్ని వర్గాలు అభివృద్ధి చెందలేదని, అందువల్ల రిజర్వేషన్లు కొనసాగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సమాజంలోని చివరి వ్యక్తి అభివృద్ధి చెందే వరకు రిజర్వేషన్లను కొనసాగించాల్సి ఉందంటూ ప్రతినిధుల సభలో తీర్మానించినట్టు గుర్తు చేశారు. కులాల లెక్కలు సేకరించనంత మాత్రాన రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఎక్కడా లేదని చెప్పారు. దేశ వ్యాప్త కులగణన జరగాలని కాంగ్రెస్‌ ఇతర పార్టీలు కోరుతున్న విషయం తెలిసిందే.