Happiest Countries 2024 : మార్చి 20వ తేదీ ‘అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవం’. ఈసందర్బంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ సస్టయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్’ బుధవారం ఉదయం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల(Happiest Countries 2024) లిస్టును విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. ఈ దేశం గత ఏడు ఏళ్లుగా ఫస్ట్ ప్లేస్‌లోనే కంటిన్యూ అవుతుండటం విశేషం. డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాలు వరుసగా రెండు, మూడు స్థానాలు సాధించాయి. ప్రపంచంలోని 143కిపైగా దేశాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ లిస్టును రూపొందించారు. ప్రజల ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అత్యంత సంతోషకరమైన దేశాల టాప్-10 లిస్టులో అత్యధిక జనాభా కలిగిన దేశమేదీ లేదు. తొలి పది దేశాలలో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే. టాప్-20లో కెనడా, యూకే మాత్రమే మూడు కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశాలు.
We’re now on WhatsApp. Click to Join
- గత దశాబ్దకాలంలో తొలిసారిగా అమెరికా, జర్మనీ దేశాలు టాప్-20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి.
- కోస్టారికా, కువైట్ దేశాలు తొలిసారి టాప్-20లోకి వచ్చాయి. అవి వరుసగా 12, 13 స్థానాలు దక్కించుకున్నాయి.
- ఈ లిస్టులో మన భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ఒకస్థానం కిందకు జారడం గమనార్హం.
- చైనా (60), నేపాల్ (95), పాకిస్తాన్ (108), మయన్మార్(118) దేశాలు ఇండియా కంటే బెటర్ ప్లేస్‌లలో నిలిచాయి.
- తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో లాస్ట్ ప్లేస్‌కు పరిమితమైంది.
- 2006-10 సంవత్సరాల టైం నుంచి ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయారు. సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.
- పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకేరకంగా లేదని తెలిపింది.
- ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది.
- మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు వెల్లడించింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనంద స్థాయులను అనుభవిస్తున్నట్లు తేలింది.
- సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది.
Read :Group 2 Prelims : గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే..
ఫిన్లాండ్ ప్రజలకు అంత సంతోషమెందుకు ?
ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉంటున్నారట. ‘జీవితంలో విజయం’ అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందట. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని.. ఫిన్లాండ్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయట. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.