Uddhav Thackeray : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పిన తీరును ఆయన తప్పుపెట్టారు. ప్రధాని మోడీ చెప్పిన క్షమాపణలలో అహంకారం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రధానమంత్రి క్షమాపణలు చెబుతుంటే.. పక్కన నిల్చున్న ఉపముఖ్యమంత్రి ఒకరు నవ్వుతూ కన్పించారని ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) పేర్కొన్నారు. ‘‘శివాజీ మహరాజ్ విగ్రహం కూలడం అంటే మహారాష్ట్ర ఆత్మకు అవమానం జరిగినట్టే. ఆ విగ్రహం నిర్మాణ పనుల్లో భారీ అవినీతి జరిగింది. శివాజీ మహరాజ్‌ను అవమానించిన వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం’’ అని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. శివాజీ విగ్రహం కూలిన ఘటన అనేది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి దందాకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
Also Read :Kashmir : మోడీ అండ్ టీమ్‌కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే
ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిన ఘటనపై స్పందించారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు ఆరాధ్యుడు. ఆయనను మేం ఆరాధిస్తాం. శివాజీ విగ్రహం కూలినందుకు నేను చింతిస్తున్నాను. నేను తలవంచి శివాజీ మహరాజ్‌ను క్షమాపణలు కోరుతున్నాను. 2013లో బీజేపీ నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రాయ్‌గడ్‌లో ఉన్న శివాజీ సమాధి దగ్గరి వచ్చాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాకే ముందుకు సాగాను’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.