Amit Shah : దేశ రాజకీయాల్లో తాజాగా సంచలనం సృష్టించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై వస్తున్న విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా ఖండించారు. జైలుకు వెళ్లిన నాయకులు పదవుల్లో కొనసాగకుండా ఉండేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రకారం ఐదేళ్ల పైగా శిక్ష పడే అవకాశమున్న కేసులో ప్రధాని సహా ఏ నేతైనా అరెస్టై 30 రోజులకు పైగా కస్టడీలో ఉంటే, 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దీనిపై స్పందించిన అమిత్ షా ఈ నిబంధన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందని ఆయన తనపైనా చట్టం వర్తించేటట్లు తాను స్వయంగా ముందుకొచ్చారని చెప్పారు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ జైలు నుంచి పాలన చేస్తారా? జైలునే సీఎం హౌస్, పీఎం హౌస్‌గా మార్చాలా? ఇది ప్రజాస్వామ్య విలువలకు తగినదా? అని అమిత్ షా ప్రశ్నించారు.
Read Also: Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
ఒక వ్యక్తి లేకపోతే ప్రభుత్వం నడవదనడం తప్పు అని అన్నారు. ఇది వ్యక్తి ఆధారిత పాలనను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు బీజేపీయేతర ప్రభుత్వాలే లక్ష్యమంటూ అనవసరంగా బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవం అదే కాదు. ఇది అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి తీసుకొస్తున్న ఒక ఆవశ్యకమైన దిద్దుబాటు అని వ్యాఖ్యానించారు. గతంలో ఇందిరా గాంధీ తన పదవిని రక్షించేందుకు 39వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటి ప్రధాని తన పదవిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చారు. కానీ మోదీ గారు మాత్రం అలా చేయలేదు. ఆయన తనకు స్వయంగా వర్తించేలా ఈ నిబంధనలను రూపొందించారు అని చెప్పారు అమిత్ షా. పదవి కోల్పోయిన నేతలు బెయిల్ వచ్చాక మళ్లీ ప్రమాణస్వీకారం చేయవచ్చని ఇది ఏ పార్టీ మెజారిటీకి భంగం కలిగించదని స్పష్టంచేశారు.
ఒక సభ్యుడు జైలులో ఉంటే ఆ సమయంలో పార్టీకి చెందిన మరో నాయకుడు ప్రభుత్వాన్ని నడిపించొచ్చు. తర్వాత మళ్లీ అనుకున్నదాన్ని కొనసాగించవచ్చు అని వివరించారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించి అక్కడ విశ్లేషించవచ్చని సూచించారు. కానీ ప్రతిపక్షాలు సాంకేతికంగా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరుగదని, మళ్లీ మానవీయ విలువలను నిలబెట్టే దిశగా ఒక బాధ్యతాయుతమైన అడుగుగా చెప్పేలా కేంద్రం దీనిని తీసుకొచ్చిందని అమిత్ షా తెలిపారు.