Site icon HashtagU Telugu

New Delhi: ట్రాఫిక్‎లో హారన్ కొట్టిన మహిళ.. చితకబాదిన ప్రయాణికుడు!

Whatsapp Image 2023 01 19 At 22.09.47

Whatsapp Image 2023 01 19 At 22.09.47

New Delhi: ఈ మధ్యన మనం ప్రతిదానికి చిరాకు పడే వ్యక్తులను చూస్తుంటాం. చాలామందికి ఓపిక లేకపోవడం వల్ల చిరాకు కలుగుతుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా సిగ్నల్ గ్రీన్ కాక ముందే వెళ్లిపోవాలన్నంతలా తొందరపడుతుంటారు. కొన్నిసార్లు ఈ ప్రవర్తన ఎదుటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గురుగ్రామ్ లో ఇలాంటి ఓ చిరాకు చివరకు పోలీసు కేస్ దాకా వెళ్లింది. హారన్ కొట్టడం ఓ మహిళ మీద దాడికి కారణమైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎప్పుడూ ట్రాఫిక్ తో కిటకిటలాడే గురుగ్రామ్ లో బుధవారం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ గ్రీన్ సిగ్నల్ కోసం, ట్రాఫిక్ క్లీయర్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అంతలో ఓ మహిళ హారన్ కొట్టింది. ఆమె అలా హారన్ కొట్టడంతో ఎదుటి కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. వెంటనే కారు దిగి.. హారన్ కొట్టిన మహిళను కారులో నుండి బయటకు లాగాడు.

హారన్ ఎందుకు కొట్టావంటూ సదరు మహిళ మీద ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ.. ఆ ప్రయాణికుడి మీద ఫిర్యాదు చేసింది. మహిళ చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక కారు తన కారును ఓవర్ టెక్ చేసి, తన ముందుకు వచ్చి నిలబడింది. తాను హారన్ కొట్టగానే, ఎదుటి కారులో నుండి ఒక వ్యక్తి దిగి, తనను కారులోంచి బయటకు లాగి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తన ఎడమ కంటిపై, ముక్కుపై గాయాలు అయినట్లు ఆమె వివరించింది.

ఆ ప్రయాణికుడు తనను చంపేస్తానని కూడా బెదిరించినట్లు ఆ మహిళ వివరించింది. తనను ఇంటికి వచ్చి మరీ కొడతానని బెదిరించాడని ఆమె పేర్కొంది. కాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో పని చేస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నోలీసులు.. ఆమె మీద దాడి చేసిన వ్యక్తి మీద 323, 506, 509 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సిసిటివి ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించే పనిలోపడ్డారు పోలీసులు.