భారత్ – పాకిస్థాన్ (India – Pakistan War) మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితిని తానే అదుపులోకి తెచ్చానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul )సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఒత్తిడివల్లే యుద్ధం ఆగిందని, ఇందుకోసం తాను పలు దేశాధ్యక్షులను కలిసి చర్చలు జరిపానని వెల్లడించారు. అయితే ఆ సమావేశాల ఫొటోలు బయట పెట్టలేదని, సంబంధిత దేశాధినేతలు స్వయంగా అలా కోరినందునే వాటిని గోప్యంగా ఉంచినట్లు పాల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Saraswati Pushkara Mahotsav: సరస్వతి పుష్కర మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భట్టి!
అంతేగాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే యుద్ధం ఆపినట్లు చేసిన ప్రకటన హాస్యాస్పదమని పాల్ విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో తాను శాంతి దూతగా పని చేస్తున్న విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. తన చర్యల వల్లే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తక్షణమే తగ్గాయని పేర్కొంటూ, యుద్ధం నివారణలో తన పాత్రను ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో శాంతి సభ నిర్వహించనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. శాంతి, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతి భద్రతకు తాను తోడ్పాటునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పాల్ పేర్కొన్నారు.