Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!

అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం

Published By: HashtagU Telugu Desk
Venkaiah Naidu

Venkaiah Naidu

అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, కనీస ధర్మంగా పాటించడం ద్వారా వ్యక్తిగతంగా, సమాజాన్ని తద్వారా భారతదేశాన్ని మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమని ఆయన సూచించారు.

15-18 ఏళ్ల వారికోసం టీకాకరణ ప్రారంభించిన నేపథ్యంలో, వారు సైతం తప్పనిసరిగా నిబంధనల ప్రకారం రిజిస్టరు చేసుకుని వీలైనంత త్వరగా టీకాలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. టీకాల విషయంలో అనుమానాలున్న వారిని చైతన్య పరిచి అందరూ టీకాలు వేసుకునే విషయంలో, పౌరసమాజం, ప్రజాసంఘాలు, వైద్య నిపుణులు, ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్ పై పోరాటంలో దేశం చేస్తున్న ప్రయత్నం మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లగలమన్నారు.

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ఉపరాష్ట్రపతి తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచం నలుమూలల ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతున్నారన్నారు. భారతీయ జీవన విధానమైన ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో ప్రపంచానికి సేవలందిస్తున్నారన్నారు. భారతీయ విలువలకు, జీవన విధానానికి అంతర్జాతీయ ఆరోగ్య సేవా వారథులుగా వీరు పనిచేస్తున్నారని ఉపరాష్ట్రపతి కితాబిచ్చారు.

  Last Updated: 05 Jan 2022, 09:21 PM IST