Sixth Phase Polling : ఆరో విడత పోలింగ్ 59.05 శాతమే.. బెంగాల్‌, కశ్మీర్‌లలో హింసాత్మక ఘటనలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్‌ ముగిసింది.

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 08:52 PM IST

Sixth Phase Polling : దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్‌ ముగిసింది. శనివారం రోజు 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 59.05 శాతం ఓటింగ్ నమోదైంది. బెంగాల్‌లో అత్యధికంగా 78.19 శాతం ఓటింగ్ నమోదవగా, జమ్మూకశ్మీర్‌లో అత్యల్పంగా 52.28 శాతం పోలింగ్ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 54.48 శాతం, జార్ఖండ్‌లో 62.74%, ఒడిశాలో 60.07%, హర్యానాలో 58.37%, బిహార్‌లో 53.30%, ఉత్తరప్రదేశ్‌లో 54.03% ఓటింగ్ నమోదైంది. ఆరో విడత ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ దశలోనే హర్యానాలోని కర్నాల్‌ అసెంబ్లీ స్థానానికి బై పోల్‌తో పాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్‌ కూడా నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join

జూన్ 1న తుది విడత పోలింగ్..

పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్‌ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఆరో దశతో కలుపుకొని ఇప్పటివరకు 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయ్యింది. జూన్‌ 1న చివరిదైన ఏడో దశతో పోలింగ్‌ ప్రక్రియకు తెరపడనుంది. తుది విడతలో ఎనిమిది రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Also Read :Lok Sabha Polls : ఐదు విడతల్లో పోలైన ఓట్ల చిట్టా ఇదిగో

ఓటు వేసిన ప్రముఖులు వీరే..

ఆరో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓటు వేసిన వారిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, సీజేఐ డీవై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, ప్రియాంకాగాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా చాందినీ చౌక్‌లోని సివిల్ లైన్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు హస్తినలో ఓటు వేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​ జనరల్ అనిల్ చౌహాన్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, క్రికెటర్ కపిల్ దేవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో ఓటు వేశారు.ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం హర్యానాలోని కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో , జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో, భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో ఓటువేశారు.