ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో హిడ్మా ఎన్‌కౌంటర్ కట్టు కథ అని ఆరోపించింది. నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని.. నవంబర్ 18న బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్రం డైరెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా హిడ్మాను ఓ మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయంగా ఈ ఎన్‌కౌంటర్‌ను కేంద్ర హోం అమిత్ షా పేర్కొన్నారు. ఇక హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే స్థితికి చేరుకుందిని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మా ఎన్‌కౌంటర్ పుర్తిగా కట్టు కథ అని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిన కుట్రగా దీన్ని అభివర్ణించింది. హిడ్మాను ఓ మహోన్నత వ్యక్తిగా పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి.. అభయ్ పేరిట లేఖ విడుదలైంది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా, కామ్రేడ్ రాజే, శంకర్‌తో పాటు మరికొందరిని.. విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులుగా ఉన్న సమయంలో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లిన క్రమంలో.. ద్రోహుల వల్ల సమాచారం లిక్ అయ్యి.. నవంబర్ 15 పోలీసులకు పట్టుబడ్డట్లు తెలిపారు. ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. అతి క్రూరంగా హత్య చేశారని.. అనంతరం ఎన్‌కౌంటర్ అని కట్టు కథ అల్లారని ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఆదేశాలు, డైరెక్షన్‌లో ఏపీ ఎస్ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) ఇదంతా చేసిందన్నారు. ఈ క్రూరమైన హత్యకు వ్యతిరేకంగా.. నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
కామ్రేడ్ హిడ్మా మొదటి నుంచి ప్రజల్లో పనిచేస్తూ, ప్రజల నుంచి నేర్చుకుంటూ ఎదిగాడని.. మావోయిస్టు పార్టీలో కూడా రాజకీయంగా, సైద్ధాంతికంగా అంచెలంచెలుగా ఎదిగాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. కార్పొరేట్ మీడియా, గోదీ మేధావులు ఎప్పటి నుంచో హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రచారాలు ఎంత చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మాకు గౌరవ స్థానం చెరగదని.. కొమురం భీం, అల్లూరి, భగత్ సింగ్, గూండదండూర్, గండ సింగ్, అల్లూరి సీతారామరాజు.. వంటి మహానుభావుల చరిత్రలాగే.. హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని పేర్కొన్నారు.
దేశంలో ఆర్‌ఎస్‌ఎస్- బీజేపీ మనువాదులు.. పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దమనం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దేశ సంపదను, ప్రజల కష్టార్జితాన్ని అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. ఫాసిస్టు శక్తులు అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇక ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీకి.. ‘గోదీ కమిషన్’గా మారిపోయిందని, బీహార్ ఎన్నికల్లో భారీ స్థాయిలో మోసాలు చేసి విజయం సాధించారని లేఖలో పేర్కొన్నారు.
