Site icon HashtagU Telugu

Robert Vadra : ఈడీ ఛార్జ్‌షీట్‌లో తొలిసారిగా రాబర్ట్‌వాద్రా పేరు.. ఏ కేసులో ?

Robert Vadra

Robert Vadra

Robert Vadra :  మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రస్తావించింది. అక్రమ సంపాదనతో భండారీ లండన్‌లో కొన్న ‘12 బ్రియాన్‌స్టోన్‌ స్క్వేర్‌’ అనే ఇంటికి వాద్రా మరమ్మతులు చేయించుకొని.. అక్కడే నివసిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో వాద్రాకు బ్రిటన్‌కు చెందిన సుమిత్‌ చడ్డా సహకరించారని పేర్కొంది. ఈ మేరకు అభియోగాలతో సుమిత్‌తో పాటు వాద్రా సన్నిహితుల్లో ఒకరైన చెరువథుర్‌ చకుట్టి థంపిపై ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని ఈడీ వెల్లడించింది. లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను రాబర్ట్ వాద్రా కోరిక  మేరకు చెరువథుర్‌ చకుట్టి థంపి పునర్నిర్మాణం చేయించారని కోర్టుకు తెలియజేసింది. లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్ సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నాడని(Robert Vadra) వెల్లడించింది.

 We’re now on WhatsApp. Click to Join.

చెరువథుర్‌ చకుట్టి థంపి యూఏఈ ఎన్ఆర్ఐ.. సుమిత్ చద్దా లండన్ పౌరుడు. ఈ కేసులో  వీరిద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులు చెరువథుర్‌ చకుట్టి థంపి, రాబర్ట్ వాద్రా మధ్య అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని ఈడీ వాదిస్తోంది. రాబర్ట్ వాద్రా, సీసీ థంపీ కలిసి ఫరీదాబాద్‌లో పెద్ద మొత్తంలో భూమిని కొన్నారని, ఒకరి ఖాతాలోకి మరొకరు భారీగా డబ్బును బదిలీ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక సంజయ్ భండారీ 2016 సంవత్సరంలోనే భారత్ నుంచి బ్రిటన్‌కు పరారయ్యాడు. 2020 జూన్ 1న సంజయ్ భండారీ, అతని 3 కంపెనీలు, సన్నిహితులు సంజీవ్ కపూర్, అనిరుధ్ వాధ్వాపై ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక ఈడీ కోర్టు సంజయ్ భండారీని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. లండన్ అడ్మినిస్ట్రేషన్ సంజయ్ భండారీని భారత్‌కు అప్పగించాలని కోరింది. అయితే అప్పగింత ఉత్తర్వును సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో భండారి అప్పీల్ దాఖలు చేశారు. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్‌ సర్కారు ఈ ఏడాది జనవరిలోనే ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.