Acharya Satyendra Das : సోనియాకు ఆహ్వానంపై అయోధ్య ప్రధాన అర్చకుడి అభ్యంతరం.. ఏమన్నారంటే ?

Acharya Satyendra Das : అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 07:11 PM IST

Acharya Satyendra Das : అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడిని నమ్మని వారు సనాతన వ్యతిరేకులన్నారు.  ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అలాంటి వాళ్లను ఆహ్వానించకూడదన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు అయోధ్య రామ మందిరం ఆహ్వాన లేఖను పంపడాన్ని ఆచార్య సత్యేంద్ర దాస్‌ తప్పుపట్టారు. ‘‘ఒకప్పుడు రాముడి ఉనికిని కొట్టిపారేసిన వాళ్లు వీళ్లే. ఇలాంటి శాశ్వత ప్రత్యర్థులను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్లు రావాల్సిన అవసరం లేదు’’ అని ఆయన (Acharya Satyendra Das) కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది. అయోధ్య రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌తో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ ప్రతినిధులు సైతం ఆహ్వానాలను అందజేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్, వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వాన లేఖలను అందించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు అయిన ఇక్బాల్‌ అన్సారీకి సైతం ఆహ్వాన లేఖను ఇచ్చారు. రామాలయ నిర్మాణం కోసం బాబ్రీ మసీదును కూల్చివేసే క్రమంలో చనిపోయిన 50 మంది కర సేవకుల కుటుంబాలను కూడా వేడుకకు ఆహ్వానించారు.

Also Read: Moon Lander : చంద్రుడిపైకి రూ.898 కోట్ల ల్యాండర్.. 50 ఏళ్ల తర్వాత ఎంట్రీ

ప్రతీ ఒక్కరికి తమ ప్రతినిధులు పత్రిక ఇస్తున్నారని.. పోస్టల్, కొరియర్ ద్వారా పంపడం లేదని ట్రస్ట్ సభ్యులు స్పష్టంచేశారు. కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆహ్వాన పత్రిక అందజేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న 50 మంది అతిథులను కూడా ఇన్వైట్ చేశామని చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ ప్రతినిధులకు కార్డ్స్ పంపించామని.. వారు అక్కడ గెస్టులను కలిసి ఆహ్వానించారని ఒక ప్రకటనలో తెలిపారు. రామాయణం టీవీ సీరియల్‌లో రాముడు, సీతాదేవిగా నటించిన నటీనటులు అరుణ్ గోవిల్, దీపిక చీకిలాకు కూడా ఆహ్వాక పత్రిక అందజేశారు. కొందరు న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలను ఇన్వైట్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన ఆహ్వాన పత్రిక బుక్ లెట్ మాదిరిగా ఉంది. తెరవగానే రామ మందిరం, రాముడి ఫొటో ఉంది. మిగతా ప్రతుల్లో రామాలయ నిర్మాణం కోసం పాటుపడ్డ వారి జీవిత చరిత్ర రాసి ఉంది.