Nithin Gadkari స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సుల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం స్థానికంగా స్లీపర్ బస్సులు తయారు చేసేవారికి అనుమతి ఇవ్వరు. అలాగే బస్సులలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపైనా కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలు తీసుకువచ్చింది.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. ఏసీ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన.. ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత రాజస్థాన్‌లో.. ఆ తర్వాత మరోచోట.. ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో స్లీపర్ బస్సులలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అంతులేని ఆవేదనలో మునిగిపోగా.. మిగతా ప్రయాణికులు మాత్రం భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన ఒకటీ రెండు రోజులు ఆ బస్సులలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనల ఉల్లంఘనపై సాగే చర్చలు, తీసుకునే చర్యలు కేవలం అప్పటికే పరిమితమవుతున్నాయి. ఆ తర్వాత అధికారులు, ప్రజలు వాటిని మర్చిపోతున్నారు. అయితే ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్లీపర్ బస్సులలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం స్థానిక, మాన్యువల్ స్లీపర్ బస్సుల బాడీ బిల్డర్లకు.. స్లీపర్ బస్సుల తయారీ కోసం అనుమతి ఉండదు. కేంద్రం నుంచి గుర్తింపు పొందిన తయారీ సంస్థలు, ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సులు తయారు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ల జారీలో అక్రమాలకు పాల్పడే అధికారులపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు.
అలాగే ఇప్పటికే ఉన్న అన్ని స్లీపర్ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తిని ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థలు, అత్యవసర లైటింగ్ వంటి ఏర్పాట్లు చేయాలని నితిన్ గడ్కరీ ఆదేశించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించడంలో అలసత్వంతో పాటుగా, అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థలు బస్సులలో లేకపోవటం, ఇష్టానుసారం ఆల్ట్రేషన్ చేసి బస్సులను నడపటం కూడా ప్రమాదాలకు కారణమని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మరోవైపు ప్రమాదాల నివారణకు కార్లలో వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ సాంకేతికత సాయంతో కార్ల వేగం, స్థానం వంటి అంశాల గురించి రియల్ టైమ్‌లో ఇతర వాహనాలతో పంచుకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు రోడ్డుపై కారులో వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తే.. ఆ విషయంపై సమీపంలోని కార్లకు సంకేతాలు వెళ్తాయి. దీంతో వాహనాలు పరస్పరం ఢీకొనే అవకాశాలు ఉండవని అధికారులు చెప్తున్నారు.
