Site icon HashtagU Telugu

Child Marriages: బాల్య వివాహ‌ల్లో ఆ రాష్ట్ర‌మే టాప్‌!

Child Marriages

Child Marriages

దేశంలో బాల్య‌వివాహాల‌కు సంబంధించి చేప‌ట్టిన స‌ర్వే గణాంకాల‌ను కేంద్ర హోం శాఖ శ‌నివారం విడుద‌ల చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా డెమోగ్రాఫిక్ శాంపిల్ సర్వే ప్రకారం.. ఝార్ఖండ్‌లో అత్యధిక శాతం బాల్య‌వివాహాలు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లో వివాహ వ‌య‌స్సు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిల శాతం 5.8గా ఉందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన సర్వేలో తేలింది.

దేశ‌వ్యాప్తంగా ఈ స‌గటు 1.9శాతంగా ఉంది. కేర‌ళ‌లో ఈ సంఖ్య 0.0గా ఉంది. ఝార్ఖండ్‌, బెంగాల్ రాష్ట్రాల్లో స‌గం మందికిపైగా యువ‌తుల‌కు 21 ఏళ్లు నిండ‌కుండానే వివాహం చేస్తున్నార‌ని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఝార్ఖండ్‌లో బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం ఉన్నాయని స‌ర్వే పేర్కొంది. ఈ సర్వే 2020లో నిర్వహించ‌గా.. గత నెల చివరిలో నివేదిక సిద్ద‌మైంది.

దేశంలో సగానికి పైగా మహిళలు 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకున్న రాష్ట్రాలు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఇదిలా ఉండగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం.. చేత‌బ‌డి చేస్తున్నార‌నే నెపంతో ఝార్ఖండ్‌లో 2015లో 32 మంది, 2016లో 27 మంది, 2017లో 19 మంది, 2018లో 18 మంది, 2019, 2020లో 15 మంది చొప్పున‌ చనిపోయారు.