జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) మరియు ఆపరేషన్ మహదేవ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదుల మూలాలను లక్ష్యంగా జరిపిన ఈ ఆపరేషన్ల ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక శిబిరాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ కీలక స్థావరాలు కోల్పోయినందువల్ల వారు కాల్పుల విరమణకు సిద్ధం కావాల్సి వచ్చిందని, భారత్ ఆధిక్యంలో ఉన్నదని స్పష్టం చేశారు.
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు తూట్లు పొడిచేలా అమిత్ షా స్పష్టత ఇచ్చారు. డీజీఎంఓ స్థాయిలో పాక్ నుండి ఫోన్ రావడం వల్లే కాల్పులు ఆగాయని వివరించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల విషయానికి వస్తే, వారు పాకిస్తాన్ జాతీయులేనన్న ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, కార్ట్రిడ్జ్‌లు పాకిస్తాన్‌లో తయారైనవేనని, వాటికి సంబంధించి పూర్తి ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహించినట్టు చెప్పారు.
ఈ ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన ఉగ్రవాదుల వివరాలు వెల్లడిస్తూ, శ్రీనగర్ దచిగామ్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సులేమాన్ షా అలియాస్ హషీం ముసా, జీబ్రాన్, హమ్జా ఆఫ్ఘనీలాంటి ఉగ్రవాదుల నామాలను ప్రకటించారు. ఉగ్రదాడికి సహకరించిన పలువురిని గతంలో NIA అరెస్ట్ చేసిందని తెలిపారు. మొత్తంగా పాకిస్తాన్ మద్దతుతోనే ఈ దాడులు జరిగాయని, అందుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయని షా స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోందన్న సంకేతంగా ఈ ప్రకటనలను రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.