Site icon HashtagU Telugu

Textile Crisis : తమిళనాడులో టెక్స్‌టైల్స్ సంక్షోభం.. దేశవ్యాప్తం అవుతుందా?

Textile

Textile

దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాటన్‌లో 35 శాతం వాడకం ఉన్న తమిళనాడులో పెద్ద సంక్షోభమే తలెత్తింది. రోజురోజుకు పెరుగుతున్న నూలు ధరలు భరించలేకపోతున్నామంటూ ఏకంగా రెండ్రోజుల బంద్ చేపట్టారు టెక్స్‌టైల్స్ వ్యాపారులు. ఈరోడ్, సేలంలో టెక్స్‌టైల్స్ దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. ఈ రెండు జిల్లాల్లోనే ఏకంగా పదివేల షాపులు మూతబడ్డాయి. గత 18 నెలలుగా నూలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తుండగానే ధరలు రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు కేంద్రం విధిస్తున్న జీఎస్టీ కారణంగా టెక్స్‌టైల్స్ రంగం మరింత కుదేలైంది. నిజానికి ఈ సమస్య ఒక్క తమిళనాడుకే పరిమితం కాలేదు. పెరుగుతున్న నూలు ధరలు, కేంద్రం విధిస్తున్న జీఎస్టీ కారణంగా దేశవ్యాప్తంగా చేనేత, వస్త్ర రంగాలకు గట్టి దెబ్బ తగిలింది. క్వింటాల్ కాటన్ ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. ఇది నిజంగా భరించలేని భారమే. దీంతో టెక్స్‌టైల్స్ రంగం నుంచి ఉత్పత్తి రానురాను తగ్గిపోతోంది. ఇప్పటికే ఆర్డర్లు పొందిన వాళ్లు అనుకున్న రేటుకు ఆర్డర్లు అందించలేకపోతున్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాంతో పోటీ పడుతున్న వస్త్ర రంగం.. దేశంలో పెరుగుతున్న కాటన్, నూలు ధరల కారణంగా ఆయా దేశాలతో పోటీపడలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. వస్త్ర రంగంలోని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడి, భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version