Ratan Tata : పారిశ్రామిక రంగంలో మనదేశం పేరును యావత్ ప్రపంచానికి వినిపించిన భారతదేశ ముద్దుబిడ్డ రతన్ టాటా. ఆయన ఇక లేరు. 86 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో రతన్ కన్నుమూశారు. తన హయాంలో, టాటా గ్రూప్ ఛైర్మన్ హోదాలో ఆయన ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. టాటా గ్రూపును శరవేగంగా వివిధ కీలక రంగాలకు విస్తరించారు. నిత్యావసరాల విక్రయ కంపెనీ బిగ్ బాస్కెట్ దగ్గరి నుంచి సాఫ్ట్‌వేర్ విక్రయ కంపెనీ టీసీఎస్ దాకా.. ట్రక్కులు, బస్సుల తయారీ నుంచి విమాన సర్వీసుల దాకా టాటా గ్రూపు విస్తరించందంటే అందుకు కారకుడు రతన్ టాటా విజన్. ఆయన హయాంలో టాటా గ్రూప్ (Ratan Tata) విస్తరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Sahara Floods: ఎడారిలో వరదలు.. 50 ఏళ్ల తర్వాత నిండిపోయిన సరస్సు
రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ ఇలా..
- రతన్ టాటా 2004లో టాటా గ్రూప్ సాఫ్ట్‌వేర్ ఔట్ సోర్సింగ్ విభాగం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్)గా మార్చారు.ప్రస్తుతం మన దేశంలోని టాప్ ఐటీ కంపెనీగా టీసీఎస్ వెలుగొందుతోంది.
- 2000 సంవత్సరంలో గ్లోబల్ టీ బ్రాండ్ ‘టెట్లీ’ గ్రూప్‌లో 33 శాతం వాటాను 271 మిలియన్ యూరోలకు రతన్ టాటా కొన్నారు. అనంతరం టాటా టీ కంపెనీ బాగా బలపడింది.
- 2004లో టాటా మోటార్స్ దివాలా తీసింది. అయినా రతన్ టాటా వెనకడుగు వేయలేదు. దక్షిణ కొరియాకు చెందిన దేవూ మోటార్స్‌కు చెందిన ట్రక్కుల తయారీ విభాగమైన దేవూ కమర్షియల్ వెహికల్‌ను రూ. 465 కోట్లకు కొన్నారు.
- రతన్ టాటా 2006లో టాటా స్కైని ప్రారంభించారు. తద్వారా టాటా గ్రూపు డైరెక్ట్-టు-హోమ్ (DTH) టెలివిజన్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇది ఇప్పటికీ టెలివిజన్ నెట్‌వర్క్ పంపిణీ వ్యాపారంలో దిగ్గజంగా వెలుగొందుతోంది.
- 2007లో రతన్ టాటా బ్రిటన్‌కు చెందిన కోరస్ గ్రూప్‌ను $11.3 బిలియన్లకు కొన్నారు. దీంతో టాటా స్టీల్ బలోపేతమైంది. అప్పట్లో భారతీయ కార్పొరేట్ చరిత్రలో అదే అతిపెద్ద కొనుగోలు డీల్. ఈ డీల్ వల్ల ఐరోపా దేశాల్లో టాటా గ్రూపునకు మంచి పేరు వచ్చింది. అయితే చైనీస్ స్టీల్‌తో ఐరోపా దేశాల స్టీల్ పోటీ పడలేకపోయింది. దీంతో ఆ డీల్ టాటా గ్రూపునకు పెద్దగా కలిసిరాలేదు.
- 2007లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్ వ్యాపారాన్ని రతన్ టాటా ప్రారంభించారు. అప్పట్లో మనదేశంలో ఈ రంగంలోకి అడుగిడిన తొలి కంపెనీ ఇదొక్కటే. ఈ కంపెనీ 2024లో రూ.342 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులస్ అవకాశాలను విస్తరించేందుకు అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read :Ratan Tata Quotes : రతన్ టాటా చెప్పిన టాప్-10 సూక్తులు ఇవే
- 2008లో రతన్ టాటా జాగ్వార్-ల్యాండ్ రోవర్ (JLR)ను ఫోర్డ్ మోటార్స్ నుంచి $2.5 బిలియన్లకు కొన్నారు. దీంతో టాటా మోటార్స్ బలోపేతమైంది.
- 2008లో రతన్ టాటా తన సొంత ఆసక్తితో నానో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.లక్ష. బాగానే సేల్స్ జరిగాయి. అయితే 2012 సంవత్సరం తర్వాత క్రమంగా దాన్ని కొనేందుకు జనం ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆ ప్రయత్నం ఫెయిలైంది. 2018లో నానో కార్ల ఉత్పత్తిని ఆపేశారు.
- 2009లో దక్షిణాఫ్రికా టెలికాం కంపెనీ నియోటెల్‌లో టాటా కమ్యూనికేషన్స్ మెజారిటీ వాటాను కొనేసింది. దీంతో ఆఫ్రికా టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది.
- 2011లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌లో మెజారిటీ వాటాను రతన్ టాటా కొనేశారు.
- 2012లో టాటా స్టీల్ కెనడియన్ కంపెనీ ఎసిలర్ మిట్టల్‌లో 26 శాతం వాటాను కొన్నారు.
- 2012లో స్టార్‌బక్స్‌తో టాటా గ్రూప్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఏటా రూ. 1,000 కోట్లకుపైగా రాబడికి స్కేల్ చేయడానికి 11 సంవత్సరాలు పడుతుందని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సంస్థ 2028 నాటికి మన దేశంలో మరో 1,000 స్టోర్లను ప్రారంభించనుంది.
- 2021లో ఆన్‌లైన్ కిరాణా స్టోర్ బిగ్‌బాస్కెట్‌లో 64 శాతం వాటాను రతన్ టాటా కొన్నారు. తద్వారా అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్‌తో పోటీకి ఆయన రెడీ అయ్యారు.
- 1932లో జేఆర్‌డీ టాటా ఎయిర్ ఇండియాను ప్రారంభించారు. అయితే అది తర్వాత ప్రభుత్వపరమైంది. రతన్ టాటా మళ్లీ 2021లో ఎయిర్ ఇండియాను కొనేసి టాటా గ్రూపులో కలిపారు.