Terrorists Trekking : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ముడిపడిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు నలుగురు టెర్రిరిస్టులు ఏకంగా 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ పహల్గాంకు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు కోకెర్నాగ్ అడవుల నుంచి పహల్గాం పరిధిలోని బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చారని వెల్లడైంది. ఈ టెర్రరిస్టులు చాలా కష్టతరమైన మార్గం మీదుగా ట్రెక్కింగ్ చేసి బైసరన్ లోయకు చేరుకున్నారని గుర్తించారు. 25 మందికిపైగా పురుషులను లక్ష్యంగా చేసుకుని ఈ నలుగురు టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఒక స్థానికుడు, పర్యాటకుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను దొంగిలించారు.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఉగ్రవాదులను తీసుకొచ్చింది ఆదిలే..
ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో(Terrorists Trekking) ముగ్గురు విదేశీయులు. మరొకరు స్థానిక ఉగ్రవాది ఆదిల్ థోకర్. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహారాకు సమీపంలోని గురీ అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఆదిల్. ఇతగాడు 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాకిస్తాన్ నుంచి విద్యార్థి వీసా పొందాడు. వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లాడు. అలా వెళ్లిన ఆదిల్.. ఉగ్రవాదిగా మారి తిరిగొచ్చి సొంతగడ్డపైనే అకృత్యాలకు పాల్పడ్డాడు. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను ట్రెక్కింగ్ చేయిస్తూ కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ దాకా ఆదిల్ థోకర్ తీసుకొచ్చాడు. AK-47, M4 అస్సాల్ట్ రైఫిళ్లతో పర్యాటకులపై ఉగ్రవాదులు ఫైరింగ్ చేశారని వెల్లడైంది. ఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జ్‌ల ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత ఈవిషయం కన్ఫార్మ్ అయింది.
కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్
ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో స్థానిక ఫోటోగ్రాఫర్ ఒకరు అక్కడే ఉండి, చాలా వరకు ఫొటోలు తీశారు. ఆయన ఇప్పుడు కీలక సాక్షిగా మారారు. సమీపంలోని దుకాణాల వెనుక నుంచి ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి.. టూరిస్టులపై కాల్పులు జరిపారని ఆ ఫోటోగ్రాఫర్ వెల్లడించారు.