Radhika Yadav : దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక దారుణం హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ (25)ని స్వయానా ఆమె తండ్రే కాల్చి చంపేశాడట..! పోలీసులు ఇదే విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే, తండ్రి చెప్పిన మాటలు, ఆయన వాదనల్లో ఉన్న కొన్ని తేడాలు.. ఈ కేసులో కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి.
గురుగ్రామ్ సెక్టార్ 57లోని సుశాంత్ లోక్‌లో ఉన్న వాళ్ల ఇంట్లోనే గురువారం ఉదయం 10:30 ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. రాధికా వంటింట్లో ఉంది. అంతలోనే ఆమె తండ్రి దీపక్ యాదవ్ తన లైసెన్స్ ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రాథమికంగా చూస్తే, రాధికాకి మూడు నుంచి ఐదు బుల్లెట్లు తగిలాయి.
కొన్ని ఆమె వెనుక, నడుము భాగంలో ఉన్నాయట. తుపాకీ శబ్దం విని రాధికా బాబాయి కులదీప్ యాదవ్, ఆయన కొడుకు పియూష్ పైకి రాగా, రాధికా రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆసియా మోరింగో ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.పోలీసుల విచారణలో దీపక్ యాదవ్, “అవును, నేనే కాల్చాను” అని ఒప్పుకున్నాడు. “నేను పాలు తేవడానికి వెళ్ళినప్పుడు, జనాలంతా నా కూతురు సంపాదన మీద బతుకుతున్నావని నన్ను వెక్కిరించేవారు. నా ఆత్మగౌరవం చాలా దెబ్బతింది. కొందరు నా కూతురు నడవడిక గురించి కూడా తప్పుగా మాట్లాడారు. అది నన్ను చాలా బాధపెట్టింది. టెన్నిస్ అకాడమీ మూసేయమని చెప్పినా రాధికా వినలేదు.
దానితో నేను బాగా ఒత్తిడికి గురయ్యాను. ఆ కోపంలోనే నా తుపాకీ తీసి, వంటింట్లో ఉన్న రాధికాను మూడు సార్లు కాల్చి చంపేశాను” అని పోలీసులకు చెప్పాడు. అయితే, దీపక్ యాదవ్ చెప్పిన మాటల్లో కొన్ని తేడాలు, కొత్త అనుమానాలు బయటపడుతున్నాయి.. దీపక్ తాను రాధికాను వెనుక నుండి నడుముపై కాల్చినట్లు చెప్పాడు. కానీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం, రాధికా ఛాతీ భాగంలో, శరీరానికి ముందు వైపు నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నాయట. దీన్ని బట్టి తండ్రి చెప్పిన మాటల్లో ఏదో తేడా ఉంది.ఘటన జరిగినప్పుడు రాధికా తల్లి మంజు యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. కానీ, ఆమె రాతపూర్వకంగా ఏమీ చెప్పడానికి నిరాకరించారు. నోటి మాటతో.. తనకు జ్వరం ఉందని, గదిలో ఉన్నానని, భర్త ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదని చెప్పారు. తన కూతురు రాధికా చాలా మంచిదని ఆమె అన్నారు.
దీపక్ యాదవ్ కూతురు సంపాదనపై ఆధారపడటం పట్ల ఎగతాళి చేశారని చెప్పినా, వాళ్ల కుటుంబం ఆర్థికంగా బాగానే ఉందని పోలీసులు అంటున్నారు. దీపక్ గతంలో కారు విడిభాగాల దుకాణం నడిపేవాడని, అద్దె ఆదాయం కూడా ఉందని, రాధికా అన్నయ్య రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు, రాధికా టెన్నిస్ కెరీర్ కోసం దీపక్ దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని కూడా సమాచారం. కొన్ని వార్తల ప్రకారం, రాధికా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఒక మ్యూజిక్ వీడియో షూటింగ్ కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చు అనే కోణం విచారణలో ఉందట. ఆ వీడియోలో ఆమె ఒక సింగర్/నటుడు ఇనాముక్ హక్‌తో కలిసి నటించింది. అయితే, పోలీసులు ఇంకా ఈ వీడియోనే కారణం అని ఖచ్చితంగా చెప్పలేదు. రాధికా హత్యకు ఒక నెల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీపక్ యాదవ్ చాలా కోపిష్టి స్వభావం కలవాడని, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని ఇంట్లో వాళ్లపై చూపించేవాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాధికా తల్లి మంజు కూడా దీపక్‌కి అనుమానించే స్వభావం ఉందని, గతంలో కూడా తన బంధువులతో మాట్లాడొద్దని ఆమెను అడ్డుకున్నాడని చెప్పింది. మార్చి 23, 2000న పుట్టిన రాధికా యాదవ్, ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. ఆమె ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నవంబర్ 4, 2024 నాటికి 113వ ర్యాంకుకు చేరుకుంది. హర్యానా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉంది. భుజం గాయం వల్ల ఆటకు కొంతకాలం దూరమైనా, పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి తన అకాడమీని మొదలుపెట్టింది. స్నేహితులు, పక్కింటి వాళ్ళు ఆమెను “చాలా మంచి అమ్మాయి, కష్టపడి పనిచేసేది” అని చెప్పారు.
గురుగ్రామ్ కోర్టు దీపక్ యాదవ్‌ను 14 రోజుల కస్టడీకి పంపింది. పోలీసులు తుపాకీ, బుల్లెట్లు, రక్తపు నమూనాలు లాంటి ఆధారాలను సేకరించారు. తండ్రి దీపక్ మాటల్లోని తేడాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న పూర్తి నిజాన్ని బయటపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాధికా మరణం క్రీడా ప్రపంచాన్ని, సమాజాన్ని షాక్‌కు గురిచేసింది.
Nipah Virus : కేరళ సరిహద్దుల్లో నిపా వ్యాధిపై అలర్ట్.. తమిళనాడు వైద్య శాఖ అప్రమత్తం