Uttar Pradesh: శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలోని హైదర్‌గఢ్ ప్రాంతంలో ఉన్న అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన జలాభిషేకానికి భక్తులు భారీగా హాజరయ్యారు. అయితే ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర ఘటన రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఆలయానికి అగదిగా ఉన్న విద్యుత్ తీగలపై ఒక కోతి దూకడంతో, పాత తీగ ఒకటి తెగి టిన్ షెడ్‌పై పడింది. ఈ తీగ లైవ్ వైర్ కావడంతో, టిన్ షెడ్‌కు విద్యుత్ ప్రసరించి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అప్రమత్తమైన భక్తులు చుట్టూ ఉన్నవారిపై తొక్కుతూ బయటికి పరుగులు తీశారు. ఈ హడావుడిలో పలువురు భక్తులు నేలకుపడి గాయపడ్డారు.
విద్యుత్ షాక్ వల్ల ఇద్దరు భక్తులు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఒకరిని ముబారక్‌పుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరో మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన 19 మందిని త్రివేదీగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అధికారులు మాట్లాడుతూ..ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం కోతి విద్యుత్ తీగలపై దూకడంతో తీగ తెగిపోయి టిన్ షెడ్‌పై పడింది. టిన్ షెడ్ మెటల్ కావడంతో విద్యుత్ ప్రవాహం విస్తరించి ప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్‌తో మొదలైన గందరగోళం వల్ల తొక్కిసలాట ఏర్పడింది అని తెలిపారు. ఇదే సమయంలో భద్రతా ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. శ్రావణ మాసంలో సోమవారం రోజులు హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైనవి కావడంతో ఆలయాల వద్ద భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు.
ఈ తరహా పరిస్థితులకు ముందుగా సిద్ధంగా ఉండాల్సిన అధికారులు, స్థానిక యాజమాన్యం విఫలమైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా, గత రెండు రోజుల్లో ఇదే తరహా ఇది రెండో తొక్కిసలాట ఘటన కావడం గమనార్హం. నిన్నటిదాకా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఆ ఘటన కూడా విద్యుత్ షాక్ పుకార్లే కారణమైందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు, విద్యుత్ లైన్లకు సరైన సంరక్షణ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీముల ఏర్పాటు వంటి అంశాలపై యాజమాన్యం మరియు అధికారులు మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.