Freedom Fighters : ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day 2023) జరుపుకుంటున్నాం. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల (Freedom Fighters) ప్రాణ త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలుగు వీరులను ఓసారి స్మరించుకుందాం.
అల్లూరి సీతారామరాజు
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలబడిన యువ విప్లవకారుడు. మన్యం పాలిట దైవం అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు అప్పటి కాలంలోనే బ్రిటీష్ పోలీసు స్టేషన్లపై బాంబు దాడి చేశారు. నేటికీ ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అల్లూరి పేరిట అనేక సినిమాలు కూడా వచ్చాయి. అల్లూరి 1924లో బ్రిటీష్ వారిని గుండెల మీద కాల్చమని ధైర్యంగా అడిగిన వీరుడు. వారి తుపాకి తూటాలకు బలై వీరమరణం పొందాడు.
టంగుటూరి ప్రకాశం
టంగుటూరి ప్రకాశం పంతులుగా పేరు తెచ్చుకున్న ఈయన సైమన్ కమిషన్ మద్రాసు సందర్శన సమయంలో బ్రిటీష్ వారు కాల్పులు జరిపినా కూడా ఏ మాత్రం భయపడకుండా తన గుండెను చూపించిన ధైర్యశాలి. అందుకే ఆయన ‘ఆంధ్ర కేసరి’ అనే బిరుదును సంపాదించారు.
తాండ్ర పాపారాయుడు
పాపారాయుడు గురించి అతి తక్కువ మందికే తెలుసు. నారు పోసావా.. నీరు కట్టావా ఎందుకు కట్టాలి రా.. కప్పం ఎందుకు కట్టాలి శిస్తు అని బహిరంగంగా బ్రిటీష్ వారిని ప్రశ్నించిన ధీరుడు తాండ్ర పాపారాయుడు. ఈయనను బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన నేపథ్యంలో వీరమరణం పొందారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ మండలంతో పాటు చుట్టుపక్కల వారు నరసింహారెడ్డి గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. 1846 సంవత్సరంలో బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడాడు.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగరవేయడం ఆనవాయితి. ఈ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగర వేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరుస్తాయి.
Also Read: Virji Vohra: నాటి సంపన్న భారతీయ వ్యాపారి గురించి తెలుసా..? బ్రిటీషర్లు, మొఘల్ చక్రవర్తికే అప్పు..!