Telecom Bill 2023 : బ్రిటీష్ వాళ్ల కాలం నాటి టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త ‘టెలికాం బిల్లు – 2023’ రాబోతోంది. దీన్ని డిసెంబరు 18వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అందులోని ఒక కీలకమైన ప్రతిపాదన గురించి ఇప్పుడు అంతటా వాడివేడి చర్చ జరుగుతోంది. ‘‘ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నెట్‌వర్క్‌ను కేంద్ర సర్కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు’’ అనే నిబంధన కొత్త టెలికాం బిల్లులో ఉంది. ‘‘ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. నేరపూరిత చర్యలను ప్రేరేపించడాన్ని నిరోధించడానికిగానూ టెలికాం సేవలను ఆపేసి, మెసేజ్‌లను నిలువరించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది’’ అనే అంశాన్ని ఈ బిల్లులో ప్రపోజ్ చేశారు. జాతీయ భద్రత కోసం, యుద్ధం సంభవించినప్పుడు టెలికాం సంస్థల నియంత్రణకు మార్గదర్శకాలు ఇచ్చే హక్కు కూడా కేంద్ర సర్కారుకు ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. టెలికాం కంపెనీలు తాము వినియోగించే టెలికమ్యూనికేషన్ పరికరాలను కేవలం విశ్వసనీయ దేశాల నుంచే కొనేలా కట్టడి చేసే నిబంధన కూడా ఇందులో ఉంది. కాగా, ఈ బిల్లును ఆగస్టులోనే క్యాబినెట్ ఆమోదించింది.
We’re now on WhatsApp. Click to Join.
రూ.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు..
టెలికాం సేవల కోసం తప్పుడు వివరాలను సమర్పిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. టెలికాం సంస్థలకు ఒక్కో సర్కిల్‌పై గరిష్ఠ జరిమానా విధింపు పరిమితిని రూ.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు కుదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను కూడా టెలికాం లైసెన్సు పరిధిలోకి తీసుకురావాలనే ప్రపోజల్‌ను కొత్త టెలికాం బిల్లులో(Telecom Bill 2023) తొలుత చేర్చారు. అయితే ఆ తర్వాత దాన్ని తొలగించారు. దీంతో వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఊరట లభించింది.
Also Read: IPS Transfers : 20మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు
సెల్‌ఫోన్ల ట్యాపింగ్‌పై..
- కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి లేనిదే ఇతరుల ఫోన్లను దర్యాప్తు సంస్థలు ట్యాప్ చేయడానికి వీల్లేదనే నిబంధనను కొత్త టెలికాం బిల్లులో చేర్చారు. సెల్‌ఫోన్లను ట్యాప్ చేయడాన్నికొత్త టెలికమ్యూనికేషన్ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
- అనధికారికంగా, ఇతరుల వివరాలను అందజేసి టెలిఫోన్/సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకున్నా గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
- ప్రచురణ, ప్రసారాల కోసం జర్నలిస్టులు పంపే సందేశాలపై నిఘా ఉండకూడదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.
- ప్రజలు పంపే మెసేజ్‌లలోని బాంబ్, డ్రగ్స్ లాంటి పదాలపై నిఘా విభాగాల ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇలాంటి పదాలను ఎవరైనా మెసేజ్‌లలో పంపితే.. వెంటనే నిఘా విభాగాలు అలర్ట్ అవుతాయి. గుర్తింపు పొందిన జర్నలిస్టులు వృత్తిలో భాగంగా ఇలాంటి పదాలు వాడితే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.