Caller ID Feature : ప్రతీ ఫోనులో కాలర్ ఐడీ ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఫోన్లలో ఈ ఫీచరును తేవాలని టెలికాం కంపెనీలపై కేంద్ర టెలికాం శాఖ ఒత్తిడిని పెంచుతోంది. గతవారం టెలికాం కంపెనీల ప్రతినిధులతో కేంద్ర టెలికాం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై ప్రధాన చర్చ జరిగిందట. కాలర్ ఐడీ ఫీచర్‌ను ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ (సీఎన్‌ఏపీ) సర్వీసు అని కూడా పిలుస్తారు. ఇది ఫోన్లలో అందుబాటులోకి వస్తే.. మనకు ఫోన్ కాల్ చేసే వ్యక్తి పేరు వెంటనే డిస్‌ప్లే అవుతుంది. ఇందుకోసం మనం ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను వాడాల్సిన అవసరం ఉండదు.
Also Read :Kerala Mans Samadhi : ఓ వ్యక్తి సజీవ సమాధిపై మిస్టరీ.. సమాధిని తవ్వి ఏం చేశారంటే..
సీఎన్‌ఏపీ సర్వీసు(Caller ID Feature) ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని గత వారం జరిగిన సమావేశం వేదికగా టెలికాం కంపెనీలు వెల్లడించాయి. దేశంలోని వివిధ టెలికాం సర్కిళ్ల పరిధిలో దీన్ని టెస్ట్ చేస్తున్నామని తెలిపాయి. ప్రయోగాత్మక అమలులో సానుకూల ఫలితాలు వస్తే వెంటనే అమల్లోకి తెస్తామని స్పష్టం చేశాయి. అయితే 2జీ నెట్‌వర్క్‌పై నడిచే ఫోన్లు కాలర్ ఐడీ ఫీచర్‌ను సపోర్ట్ చేయవని తేల్చి చెప్పాయి. ఈ లెక్కన కాలర్ ఐడీ ఫీచర్ మన స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చేందుకు మరెంతో సమయం పట్టదు.
Also Read :Saif Ali Khans Empire: సైఫ్ అలీఖాన్‌కు ఎన్నెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసా ?
కాలర్ ఐడీ ఫీచర్ అందుబాటులోకి వస్తే టెలికాం యూజర్లకు స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ బెడద తప్పుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. అయితే దీనివల్ల వ్యక్తుల ప్రైవసీ (గోప్యత)కి భంగం కలుగుతుందని వాదించే వారు కూడా ఉన్నారు. ఫోన్ కాల్ చేసే వారి పేర్లను చూపించే ప్రత్యేక మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో.. ఇలాంటి ఫీచర్ అక్కర్లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) సిఫారసుల అమలులో భాగంగా కాలర్ ఐడీ ఫీచర్‌ను అమల్లోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.