Tejashwi Yadav : రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఈ లేఖలో తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు.
Read Also: Hero Sumanth : అక్కినేని ఇంట పెళ్లి బాజాలు..?
కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలు చేయడానికి ఉపయోగిస్తారా లేదా మునుపటి కమిషన్‌ల నివేదికల మాదిరిగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు. ఆలస్యంగా అయినా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల సమాజంలో చాలాకాలంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జనాభా గణన డేటా సామాజిక రక్షణ, రిజర్వేషన్ విధానాల సమగ్ర సమీక్షకు ఉపయోగపడేలా ఉండాలని తేజస్వీ అన్నారు. అదేవిధంగా రిజర్వేషన్లపై ఉన్న ఏకపక్ష పరిమితిని కూడా పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.
జనాభా లెక్కలు, కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నోఏళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న కులగణన డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకుండా.. దేశ ప్రజల్లో విభజనలు చేయడం సరైన చర్య కాదని పేర్కొందన్నారు. బిహార్ కుల సర్వే చేపట్టినప్పుడు కూడా పదేపదే దానిని అడ్డుకుందని గుర్తు చేశారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోడీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.