Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

సాంకేతిక సమస్యలతో విమానాలు వెనక్కి మళ్లడం, గాల్లోనే చక్కర్లు కొట్టడం వంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానం ఎక్కాలంటే కొందరు భయపడిపోతున్నారు. సురక్షితంగా గమ్యానికి చేరుకుంటామో లేదో అనే టెన్షన్‌కు గురవుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని హుబ్లికి వెళ్లిన విమానంలోని ప్రయాణికులకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. సాంకేతికలోపం, ప్రతికూల వాతావరణంతో ఆ విమానం దాదాపు 4 గంటలకుపైగా గాల్లోనే గింగిరాలు తిరిగి, చివరకు బెంగళూరులో దిగింది. #HubballiCrosswind over Hubballi forced […]

Published By: HashtagU Telugu Desk
Hyderabad-Hubballi flight diverted to Bengaluru

Hyderabad-Hubballi flight diverted to Bengaluru

సాంకేతిక సమస్యలతో విమానాలు వెనక్కి మళ్లడం, గాల్లోనే చక్కర్లు కొట్టడం వంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానం ఎక్కాలంటే కొందరు భయపడిపోతున్నారు. సురక్షితంగా గమ్యానికి చేరుకుంటామో లేదో అనే టెన్షన్‌కు గురవుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని హుబ్లికి వెళ్లిన విమానంలోని ప్రయాణికులకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. సాంకేతికలోపం, ప్రతికూల వాతావరణంతో ఆ విమానం దాదాపు 4 గంటలకుపైగా గాల్లోనే గింగిరాలు తిరిగి, చివరకు బెంగళూరులో దిగింది.

వరుసగా విమానంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్‌- కర్ణాటకలోని హుబ్లి విమానంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సాంకేతికలోపం, ప్రతికూల వాతావరణం కారణంగా విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు భయంతో వణికిపోయి హహాకారాలు చేస్తూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గమ్యానికి చేరుకున్న తర్వాత ల్యాండింగ్‌కు ఆటంకం ఎదురయ్యింది. కానీ, చివరకు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అక్కడ సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హుబ్బళ్లి (హుబ్లీ)కి బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు హుబ్లి చేరుకోవాల్సి ఉంది. కానీ, గమ్యానికి కొద్ది దూరంలోనే ఉండగా ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు ల్యాండింగ్‌ను నిలిపివేశారు. నాలుగు గంటలు పాటు అది గాల్లోనే చక్కర్లు కొట్టింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, సురక్షితంగా విమానం దిగేలా చూసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో విమానం ముండగోడ్, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టింది. సమస్య కొలిక్కి వచ్చి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా హుబ్లిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతికూలత ఏర్పడటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. చివరకు ఏటీసీ సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు.

బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మళ్లించి రాత్రి 7.30 గంటలకు అక్కడ సురక్షితంగా దించారు. గాల్లో విమానం నాలుగు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలపై ఆశ కోల్పోయారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కాపాడమంటూ దేవుడ్ని వేడుకున్నారు. విమానం బెంగళూరుకు చేరుకోవడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా కారణాలతోనే బెంగళూరుకు మళ్లించినట్టు విమానయాన సంస్థ తెలిపింది. వారికి తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.

 

  Last Updated: 20 Apr 2026, 12:57 PM IST