Midnight Protest : అట్టుడికిన కోల్‌కతా.. ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు

ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్‌‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లోకి పలువురు వ్యక్తులు చొచ్చుకు వెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
Kolkata Hospital Midnight Protest

Midnight Protest : బుధవారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా అట్టుడికింది.  ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్‌‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లోకి పలువురు వ్యక్తులు చొచ్చుకు వెళ్లారు. ఆస్పత్రిలోని ఆస్తులను వారు ధ్వంసం చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డును కూడా వదిలిపెట్టకుండా దాడికి పాల్పడటం గమనార్హం. ఆస్పత్రిలోని మందులను కూడా పారవేశారు. ఈక్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు.

We’re now on WhatsApp. Click to Join

దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఆస్పత్రి వద్ద నిలిపిన పలు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఆస్పత్రికి సెక్యూరిటీ ఇస్తున్న కొందరు పోలీసు సిబ్బందిపై ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి 12.40 గంటల(Midnight Protest) నుంచి దాదాపు గంటపాటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయని తెలుస్తోంది. అయితే ఎంతమంది పోలీసులు గాయపడ్డారు ? ఎంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు ? అనేది తెలియరాలేదు. ఈ గొడవలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదని ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు తెలిపారు.

Also Read :78th Independence Day : కాసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ

ఈ ఘటనపై అనికేత్ మైతీ అనే జూనియర్ డాక్టర్ కీలక వివరాలను తెలిపారు. “ఆస్పత్రిపై దాడి జరగడానికి చాలా ముందే అల్లరి మూకలు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరాం. కానీ వారు అడ్డుకోలేదు. అల్లర్లు ప్రారంభం కాగానే పోలీసులు కూడా హాస్పిటల్ ఆవరణలోకి వచ్చేశారు’’ అని అనికేత్ మైతీ చెప్పారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును బుధవారం సీబీఐ చేపట్టింది. మూడు టీమ్‌లుగా విడిపోయిన సీబీఐ అధికారులు కేసును విచారిస్తున్నారు.  జూనియర్ వైద్యురాలు మరణించిన ఆస్పత్రి సెమినార్ హాలులోని క్లూస్ సేకరణపై ఒక టీమ్ పనిచేస్తోంది. మరో టీమ్ కోల్‌కతా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారణను ముందుకు తీసుకెళ్తోంది. ఇంకో టీమ్ జూనియర్ వైద్యురాలితో కలిసి ఆగస్టు 8న రాత్రి ఆస్పత్రిలో డ్యూటీ చేసిన వారిని విచారిస్తోంది.

  Last Updated: 15 Aug 2024, 07:43 AM IST