Rahul & Priyanka: ‘గాంధీ కుటుంబం’ గాయ‌బ్

గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశ వ్యాప్తంగా చ‌తికిల పండింది. కేవ‌లం రెండు రాష్ట్రాల‌కు మాత్ర‌మే. కాంగ్రెస్ ప‌రిమితం అయింది.

  • Written By:
  • Updated On - March 10, 2022 / 05:26 PM IST

గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశ వ్యాప్తంగా చ‌తికిల పండింది. కేవ‌లం రెండు రాష్ట్రాల‌కు మాత్ర‌మే. కాంగ్రెస్ ప‌రిమితం అయింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. కాంగ్రెస్ భావినేత‌లుగా ఉన్న ప్రియాంక , రాహుల్ చ‌రిష్మా ఓట్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. స్వ‌యంకృతాప‌రాధం ఆ పార్టీని చావు దెబ్బ తీసింది. పంజాబ్ లో అధికారాన్ని నిల‌బెట్ట‌కోలేక పాతాళానికి వెళ్లిపోయింది. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా అక్క‌డ లేని దుస్థితికి వెళ్లింది. సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మ‌ధ్య అగాధం ఆ పార్టీని పంజాబ్ లో ముంచేసింది. మాజీ సీఎం అమ‌రేంద్ర‌సింగ్ చావు దెబ్బ తీశాడు. పీసీసీ అధ్యక్షుడు సిద్దూ, అమరేంద్ర‌సింగ్ మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాలు అక్క‌డ సీఎంగా చ‌న్నీకి అవ‌కాశం వ‌చ్చింది. సుమారు 35శాతం ఉన్న ద‌ళితులు చ‌న్నీని చూసి ఓట్లు వేస్తార‌ని కాంగ్రెస్ భావించింది. కానీ, సీఎంగా ఉన్న చ‌న్నీతో పాటు కాంగ్రెస్ పెద్ద‌లు అంద‌ర్నీ పంజాబ్ ఓట‌ర్లు తిర‌స్క‌రించారు. శ‌తాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగి ఉన్న‌ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ప‌రాభ‌వాలు వెంటాడుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలు కావడం సాధారణ అంశంగా మారింది. ఐదు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. 2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

ఇప్పుడు కేవలం రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనే అధికారానికి ప‌రిమితం అయింది. రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలను కూడా కోల్పోతే… ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదంతో దూకుడుగా వెళుతోన్న బీజేపీని త‌ట్టుకోలేక విల‌విల‌లాడి పోతోంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, జీ 23 నేత‌ల ప్ర‌భావం, నాయ‌క‌త్వ లోపం వెర‌సి కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విడితీసిన కార‌ణంగా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. వెంటిలేట‌ర్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఐక‌మ‌త్యం కంటిచూపు మేర క‌నిపించ‌డంలేదు. పైగా బీజేపీ హ‌వాతో తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కానుంది. పంజాబ్ కాంగ్రెస్ లో ఉన్న ప‌రిస్థితే తెలంగాణ కాంగ్రెస్ లోనూ క‌నిపిస్తోంది. ఉత్త‌ర భార‌త దేశంలో దాదాపుగా ఖాళీ అయిన కాంగ్రెస్ ద‌క్షిణ భార‌త దేశంలో ఉనికి కోసం పోరాడుతోంది. ఒక‌ప్పుడు ద‌క్షిణ భార‌త దేశంలో కాంగ్రెస్ బ‌లంగా ఉండేది. ప్ర‌త్యేకించి ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ కు తిరుగులేని ఓటు బ్యాంకు చాలా కాలం ఉంది. రాష్ట్రాన్ని విడ‌దీసిన త‌రువాత ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంటోంది. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే చెబుతుంటారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఆ పార్టీకి లేదు. కేవ‌లం ఉద్య‌మ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను మాత్ర‌మే రెండుసార్లు ఆద‌రించారు. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌తో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఖాళీ అయింది. ఏఐసీసీ అధ్యక్ష ప‌ద‌విని తీసుకోవ‌డానికి రాహుల్ ధైర్యం చేయ‌డంలేదు. ప్రియాంక నాయ‌క‌త్వం యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో తెలిసి పోయింది. ఇక జీ 23 నేత‌లు గాంధీ కుటుంబంపై వ్య‌తిరేక గ‌ళం మ‌రింత విప్పే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఆప్, టీఎంసీ దూసుకొస్తున్నాయి. ఆ పార్టీలే బీజేపీకి రాబో్వు రోజుల్లో ప్ర‌త్యామ్నాయం కానున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తం మీద గ్రాండ్ ఓల్డ్ పార్టీ చావుబ‌తుకుల మ‌ధ్య ఊగిస‌లాడుతోంది.