Mohammed Shami: టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. షమీ సోదరి షబీనా, ఆమె భర్త ఘజ్నవీ, ఘజ్నవీ సోదరులు అమీర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖులు ఉపాధిహామీ పథకం స్కాంలో బయటపడ్డాయి. వీరంతా ఎలాంటి పని చేయకుండానే ఉపాధిహామీ పథకం నుంచి శాలరీలు పొందారని గుర్తించారు. వీరితో పాటు మరో 11 మంది కూడా ఇలాగే అక్రమంగా ఉపాధిహామీ స్కీం శాలరీలను అందుకున్నట్లు వెల్లడైంది.
షమీ సోదరి అత్త కక్కుర్తి వల్లే.. ?
షమీ(Mohammed Shami) సోదరి షబీనా అత్త పేరు గులె ఆయెషా. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా పలౌలా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఆయెషానే ముందుండి తన కుటుంబసభ్యుల పేర్లను జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్పించారట. అంతేకాదు తన పేరును కూడా ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల లిస్టులో ఆయెషా చేర్పించుకున్నారట. ఈ వ్యవహారంపై ఇప్పటికే జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. ఉపాధి హామీ పథకం కూలీల జాబితా నుంచి షమీ సోదరి షబీనా సహా మొత్తం 18 మంది అక్రమ లబ్ధిదారుల పేర్లను తొలగించారు.
Also Read :BRS Defecting MLAs: 14 నెలలు వేస్టయ్యాయి.. అయినా కోర్టులు జోక్యం చేసుకోవద్దా ? : సుప్రీంకోర్టు
2021 నుంచి 2024 వరకు శాలరీలు తీసుకొని..
ఈవివరాలను జిల్లా మెజిస్ట్రేట్ నిధి గుప్తా మీడియాకు వెల్లడించారు. అక్రమంగా లబ్ధిపొందిన 18 మందిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారంతా ఎలాంటి పని చేయకుండానే ఉపాధి హామీ పథకం ద్వారా శాలరీలను తీసుకున్నారని నిధి గుప్తా చెప్పారు. పలౌలా గ్రామ పెద్దగా ఉన్న గులే అయేషా తన కుమారులు, కుమార్తెల పేర్లను ఈ లిస్టులో చేర్పించారని వెల్లడైందన్నారు. ఆ 18 మంది ఉపాధి హామీ పథకం ద్వారా 2021 నుంచి 2024 వరకు వేతనాలను అందుకున్నారని నిధి గుప్తా తెలిపారు. వాస్తవంగా వీరే తమ పేర్లను నమోదు చేసుకున్నారా ? లేక ఇతరులు ఇలా చేసి మోసాలకు పాల్పడుతున్నారా ? అనేది తెలియాల్సి ఉంది.