PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆర్థిక, విదేశీ వ్యవహారాలతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడవచ్చు. సమాచారం ప్రకారం.. అమెరికా విధించిన 50% టారిఫ్‌లు, ట్రంప్ ఇటీవల చేసిన H-1B వీసా నిబంధనల మార్పులు, GST సంస్కరణలు వంటి అంశాలు ఇందులో ఉండవచ్చు. అయితే ప్రభుత్వం ఈ అంశాల గురించి అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.
ప్రధాని మోడీ తరచుగా స్వదేశీని ప్రోత్సహిస్తూ దేశ ప్రజలు తమ దైనందిన జీవితంలో భారతీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్వదేశీని స్వీకరించడం అనేది కేవలం ఆర్థిక బలోపేతం కోసమే కాదని, దేశ స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించే సాధనమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఉపాధి పెరిగి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన పరిశ్రమలను, సాధారణ ప్రజలను కోరారు.
భారతదేశం-అమెరికా టారిఫ్ వివాదం
జూలై 2025లో అమెరికా భారతదేశంపై “రెసిప్రోకల్ టారిఫ్” విధించింది. దీని లక్ష్యం అమెరికాకు భారతదేశ మార్కెట్‌ను తెరవడం. అయితే దీనికి భారతదేశం అంగీకరించకపోవడంతో ట్రంప్ 25% టారిఫ్‌ను విధించారు. ఇది ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చింది. అదనంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం వల్ల అమెరికా భారతదేశంపై మరో 25% టారిఫ్‌ను విధించింది. ఇది ఆగస్టు 27 నుండి అమల్లోకి రావడంతో అమెరికా మొత్తం 50% టారిఫ్‌ను విధించింది. ఈ అంశంపై ప్రధాని మోడీ.. “తాను ఏ ధరకైనా విదేశీ శక్తుల ముందు తలవంచనని, రైతుల ప్రయోజనాలను ఎప్పటికీ రాజీపడనని” పేర్కొన్నారు.
Also Read: IND vs PAK: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంటుంది?
భారతదేశ GST సంస్కరణలు
2025 సంవత్సరం భారతదేశ పన్నుల వ్యవస్థలో ఒక చారిత్రక సంవత్సరంగా నిలిచిపోనుంది. బుధవారం (సెప్టెంబర్ 17, 2025) కేంద్ర ప్రభుత్వం కొత్త GST రేట్ల (GST New Rates 2025) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్య జూన్ 28, 2017 నాటి పాత నోటిఫికేషన్‌ను పూర్తిగా భర్తీ చేస్తుంది. ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంతకు ముందు GSTలో 0%, 5%, 12%, 18%, 28% అనే ఐదు ప్రధాన స్లాబ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం 12%, 28% స్లాబ్‌లను పూర్తిగా తొలగించింది. వాటి స్థానంలో ఇప్పుడు కేవలం రెండు ప్రధాన రేట్లు 5%, 18% మాత్రమే అమల్లో ఉంటాయి. అదనంగా GST కౌన్సిల్ పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, మద్యం, లగ్జరీ కార్లు వంటి వాటిపై 40% అధిక పన్ను రేటును నిర్ణయించింది. ఇంతకు ముందు వాటిపై సెస్ కూడా విధించేవారు. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు.
H-1B వీసా నిబంధనలలో మార్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వైట్‌హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. H-1B వీసా రుసుము చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. కానీ ఒకవేళ ఇది అమల్లోకి వస్తే నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు ఈ వీసాపై పనిచేసే ప్రతి ఉద్యోగికి ఆరు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 1,00,000 US డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి వస్తాయి.
