Tamil Nadu: తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు. జైశ్రీరామ్ అని నినదించాలంటూ విద్యార్థులను కోరడం ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గవర్నర్ తీరును తప్పుబట్టింది. బిల్లుల ఆమోదంపై తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య కొద్దికాలంగా వివాదం జరుగుతుంది. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం గవర్నర్ తీరును తప్పుబట్టింది.
Also Read: TTD Chairman BR Naidu: టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: చైర్మన్ బీఆర్ నాయుడు
మధురైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఆర్ ఎస్ రవి పాల్గొన్నారు. కంబ రామాయణం రాసిన పురాతన కవిని గౌరవించే క్రమంలో.. గవర్నర్ మాట్లాడుతూ.. ఈరోజు శ్రీరాముడి గొప్ప భక్తుడైన కవికి నివాళులర్పిద్దాం. నేను చెబుతాను.. మీరు కూడా జైశ్రీరామ్ అంటారు అని గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తుండటంతో వివాదాస్పదంగా మారింది.
డీఎంకే అధికార ప్రతినిధి ధరణీధరన్ మాట్లాడుతూ.. ‘ఇది దేశ లౌకిక విలువలకు విరుద్ధం. గవర్నర్ రాజ్యాంగాన్ని పదే పదే ఎందుకు ఉల్లంఘించాలనుకుంటున్నారు..? ఆయన ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు..? ఆయన ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి. దేశ సమాఖ్య సూత్రాలను ఆయన ఎలా ఉల్లంఘించారో, సుప్రీంకోర్టు ఆయనకు తన స్థానాన్ని ఎలా చూపించిందో మనకు తెలుసు అంటూ.. గవర్నర్ జై శ్రీరామ్ వ్యాఖ్యలపై ధరణీధరన్ మండిపడ్డారు.
గవర్నర్ రవి జై శ్రీరామ్ నినాదాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసన్ మౌలానా విమర్శించారు. గవర్నర్ మతపరమైన భావజాలాన్ని ప్రచారం చేస్తున్న మత నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. “వారు ఈ దేశంలో అత్యున్నత పదవులలో ఒకదాన్ని కలిగి ఉన్నారు. కానీ, ఒక మత నాయకుడిలా మాట్లాడుతున్నారు, ఇది ఈ దేశానికి ఇబ్బంది కలిగిస్తోంది. భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న భాషలు మరియు విభిన్న సమాజాలు ఉన్నాయి. గవర్నర్ విద్యార్థులను జై శ్రీరామ్ అని జపించమని అడుగుతూనే ఉన్నారు. ఇది అసమానతను ప్రోత్సహిస్తోంది. ఇది గవర్నర్ చేయకూడని కొన్ని మతపరమైన భావజాలాన్ని ప్రోత్సహిస్తోంది. ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ప్రచార గురువుగా మారారు అంటూ విమర్శించారు.